ప్రజాశక్తి-చీరాల: పబ్లిక్ ప్రాంతంలో ప్రభుత్వ మద్యం దుకాణం ఏర్పాటును వ్యతిరేకిస్తూ ప్రజాశక్తి దినపత్రికలో 'పట్టణ నడిబొడ్డున 'ప్రభుత్వ' మద్యమా?' అనే శీర్షికతో ప్రచురించిన కథనా నికి మున్సిపల్ సమావేశంలో కౌన్సిలర్లు స్పందించారు. మద్యం షాప్ ఏర్పాటును వ్యతిరేకిస్తూ ఆ ప్రాంతవాసులు, మహిళలు, విద్యార్థులు ఎదుర్కొనే ఇబ్బందులను ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి, చైర్మన్ శ్రీనివాస రావు దృష్టికి తీసుకువెళ్లి షాపు ఏర్పాటును నిలిపివేయాలని కోరారు. అధికారులందరూ తమ విధులను బాధ్యతగా నిర్వహించాలని అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని శాసన సభ్యులు కరణం బలరామకృష్ణమూర్తి పేర్కొన్నా రు. సోమవారం చీరాల పురపాలక సంఘ కౌన్సిల్ సమావేశపు మందిరంలో కౌన్సిల్ సాధారణ సమావేశం చైర్మన్ జంజనం శ్రీనివాస రావు అధ్యక్షతన జరిగింది. సమావేశానికి ఎమ్మెల్యే హాజరయ్యారు. పట్టణంలోని కూరగాయల మార్కెట్ సమీపంలో ప్రభుత్వ మద్యం దుకాణాన్ని పెట్టేందుకు పనులు జరుగుతున్నాయని, నిత్యం రద్దీగా ఉంటే దుకాణాల సముదాయ ప్రాంతంలో మద్యం దుకాణం ఉండటం ఇబ్బందికరమని, వీటిని వెంటనే తొలగించాలని కోరారు. దీనిపై కమిషనర్ మాట్లాడుతూ.. దుకాణం ఏర్పాటుపై పరిశీలిస్తామని అన్నారు. సమావేశంలో కమిషనర్ కె రామచంద్రారెడ్డి, మున్సిపల్ డీఈ ఏసయ్య, విద్యుత్తు డీఈ శ్రీనివాసరావు, వేటపాలెం తహసీల్దారు అశోక్‌వర్ధన్, ఆయా శాఖ అధికారులు పాల్గొన్నారు.










