ప్రజాశక్తి - ఏలూరు స్పోర్ట్స్
తలపై బలమైన గాయంతో మద్యం మత్తులో ఉన్న వ్యక్తి కాలువలో పడి అనుమానాస్పద మృతి చెందిన ఘటన ఏలూరు నగరంలో ఆదివారం చోటుచేసుకుంది. సంబంధిత వివరాలు ఇలా ఉన్నాయి. ఏలూరు రూరల్ మండలం కలకుర్రు గ్రామానికి చెందిన ఘంటసాల వెంకట గోవర్థన్(35)కు భార్య జయలక్ష్మి, ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఐదు ఎకరాల చేపల చెరువు సాగు చేస్తున్నాడు. అప్పులు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో అతని భార్యకు, అతనికి గొడవలు జరుగుతున్నాయి. ఈనెల 22న ఆమె పురుగుల మందు తాగి తీవ్ర అస్వస్థతతకు గురి కావడంతో ఏలూరులోని జెఎంఆర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. అప్పటి నుంచి ప్రతిరోజు గోవర్థన్ ఆసుపత్రికి వచ్చి వెళ్తున్నాడు. అతిగా మద్యం తాగుతున్నాడు. ఆదివారం ఉదయం ఏలూరు పాతబస్టాండ్ వద్ద కృష్ణా కాలువలో మృతి చెంది ఉన్నాడు. అతని తలకు బలమైన గాయం ఉంది. మద్యం మత్తులో బ్రిడ్జిపై నుంచి తూలి కాలువలో పడిపోయాడా, మరే ఇతర కారణాలు ఉన్నాయా అనే కోణంలో ఏలూరు టూటౌన్ పోలీసులు పరిశీలిస్తున్నారు. మృత దేహానికి పోస్టుమార్టం నిమిత్తం ఏలూరు సర్వజన ఆసుపత్రికి తరలించారు.










