Oct 29,2023 21:35

సస్పెండ్‌ చేసిన అధికారులు
పాలకోడేరు:శృంగవృక్షం రైల్వే గేట్‌మెన్‌ కొట్టు ప్రకాశరావు శనివారం అర్ధరాత్రి హైడ్రామా చేశారు. విధుల్లో ఉండగానే మద్యం తాగి ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించారు. వేసిన గేటు తీయకపోవడంతో ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. దీంతో 216 జాతీయ రహదారి వద్ద ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. గేట్‌మెన్‌ కోటేశ్వరరావు ఉండి మద్యం మత్తులో హంగామా చేశాడు. రాత్రి 10.30గంటలకు విజయవాడ నుండి నరసాపురం వెళ్లే ఫాస్ట్‌ పాసింజర్‌ ట్రెయిన్‌కు గేటు వేసిన ఆయన ట్రెయిన్‌ వెళ్లిపోయిన గేటు తెరవకపోవడంతో వాహనదారులు రైల్వే గేట్‌ క్యాబిన్‌ వద్ద పరిశీలించారు. మద్యం మత్తులో ఉన్న రైల్వే గేట్‌ మెన్‌ తికమకపడుతూ ఒకటి నొక్కబోయి మరొకటి నొక్కుతూ గందరగోళానికి గురై రైల్వే గేటు ఆపరేటింగ్‌ సిస్టంకు దండం పెడుతూ తోటి ఉద్యోగులకు ఫోన్‌ చేసి గేటు తెరుచుకోవడం లేదని అనడం వాహనదారులకు కనిపించాడు. ఆయనను వాహనదారులు నిలదీయడంతో అవును నేను తాగి డ్యూటీకి వచ్చా గేట్‌ తీస్తున్నాను రావట్లేదు నన్నేం చేయమంటారంటూ వాహనదారులపై దబాయింపులకు దిగాడు. సుమారుగా 40 నిమిషాల పాటు గేట్‌ మెన్‌ హంగామా తర్వాత రైల్వే గేట్‌ తెరుచుకుంది. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోవడంతో వాహనదారులు ఇబ్బందులను ఎదుర్కొన్నారు. మద్యం తాగి విధులకు వచ్చే ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. దీనిపై భీమవరం రైల్వే సెక్షన్‌ ఉన్నతాధికారి సత్యనారాయణ వివరణ కోరగా శాఖపరమైన చర్యల భాగంగా గేట్‌మెన్‌ కోటేశ్వరరావును సస్పెండ్‌ చేసినట్లు వెల్లడించారు.