Oct 02,2023 23:14

ప్రజాశక్తి-పిఠాపురం మద్యం, హింస లేని సమాజం కావాలని అదే గాంధీజీ కలలు కన్నారని ప్రముఖ ఇంగ్లీష్‌ అధ్యాపకులు కట్టా కృష్ణారావు అన్నారు. గాంధీ జయంతి సందర్భంగా జనవిజ్ఞాన వేదిక, మద్యపాన వ్యతరేక ప్రచార కమటీ ఆధ్వర్యంలో స్థానిక సూర్యరాయ విద్యానంద గ్రంథాలయం చెలికాని భావనరావు సభాసదన్‌లో గాంధీ జయంతి ఉత్సవం నిర్వహించారు. బాపూజీ తొలుత ఉప్పాడ బస్టాండు వద్ద గల గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం సూర్యారాయ విద్యానంద గ్రంధాలయంలో జనవిజ్ఞాన వేదిక జిల్లా ఉపాధ్యక్షుడు సూర్యనారాయణ అధ్యక్షతన సభ నిర్వహించారు. ఈ సభలో కృష్ణారావు మాట్లాడుతూ మద్యం లేని సమాజం కోసం ప్రతి ఒక్కరు చేయి చేయి కలపాలన్నారు. నేటి యువత విద్యార్థులు మద్యానికి, మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలన్నారు. అనంతరం హైస్కూల్‌ విద్యార్థులకు వ్యాస రచన పోటీలు నిర్వహించిన విజేతలకు బహుమతి ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో జెవివి నేత నేమిశెట్టి గంగబాబు, కె.అప్పారావు, అడ్వకేట్‌ భాస్కర్‌, సిసి ఆర్‌టి.ప్రసాద్‌, కరణం విశ్వనాథం, ఎంవివి.శర్మ పాల్గొన్నారు.