మద్యం, గంజాయి వలన మహిళలపై వేధింపులు
- వైసిపి పాలనలో కీచకులు ఉన్నారు
- మహిళల ఆర్థికాభివృద్ధే టిడిపి లక్ష్యం
- మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
ప్రజాశక్తి-బనగానపల్లె
రాష్ట్రంలో మద్యం, గంజాయి వల్ల మహిళలపై దాడులు, అత్యాచారాలు, గృహహింస పెరిగిపోయాయని, వైసిపి పాలనలో కీచకులు ఉన్నారని, తెలుగుదేశం పాలనలో ఆడబిడ్డలు అన్ని విధాల అభివృద్ధి సాధించారని, మహిళలకు గుర్తింపు వచ్చింది, వస్తోందని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. శుక్రవారం నంద్యాల జిల్లా బనగానపల్లె పట్టణంలోని జిఎంఆర్ ఫంక్షన్ హాల్లో మాజీ ఎమ్మెల్యే బిసి జనార్దన్ రెడ్డి సతీమణి బిసి ఇందిరారెడ్డి అధ్యక్షతన మహిళాశక్తి కార్యక్రమంలో భాగంగా మహిళా ప్రజా వేదిక- మహిళలతో ముఖాముఖి కార్యక్రమం చంద్రబాబు నిర్వహించారు. మహిళల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వైసిపి పాలనలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు డ్వాక్రా సంఘాలను ఏర్పాటు చేసి మహిళలను ఆర్థికంగా అభివృద్ధి చేసినట్లు తెలిపారు. ఆడబిడ్డలు చదువుకుని ఉద్యోగాలు చేయాలనే సంకల్పంతో కిలోమీటరుకు ఒక ప్రాథమిక పాఠశాల, 5 కిలోమీటర్లకు ఒక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రతి మండలానికి జూనియర్ కళాశాల నియోజకవర్గ కేంద్రంలో డిగ్రీ కళాశాలలను ఏర్పాటు చేశామన్నారు. 1986లో అప్పటి ముఖ్యమంత్రి ఎన్‌టిఆర్ మహిళలకు ఆస్తిలో సమాన హక్కును కల్పించినట్లు తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళలకు రిజర్వేషన్లను ఏర్పాటు చేసిన ఘనత మాపార్టీదేనని అన్నారు. చట్టసభల్లో 33 శాతం మహిళలకు రిజర్వేషన్లు కల్పించేందుకు తాము పోరాడుతున్నామని, మహిళల పోరాటానికి అండగా ఉంటామని తెలిపారు. రాష్ట్రంలో టిడిపి పాలనలో పరిశ్రమలను ఏర్పాటు చేసి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విధ్వంస పాలనలో ఉన్న పరిశ్రమలను రాష్ట్రం నుండి వెళ్లగొట్టి నిరుద్యోగ సమస్యను పెంచినట్లు విమర్శించారు. టిడిపి మేనిఫెస్టోలో మహిళా శక్తి కార్యక్రమంలో ద్వారా మహిళలను ఆర్థికంగా అభివృద్ధి చేసేందుకు ఎన్నో పథకాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. తాము అధికారంలోనికి వస్తే సంవత్సరానికి నాలుగు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామన్నారు. జిల్లాలో మహిళలు ఆర్‌టిసి బస్సుల్లో ఉచిత ప్రయాణం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. 18 సంవత్సరాలు దాటిన ప్రతి మహిళకు నెలకు రూ.1500 ఇస్తామన్నారు. విద్యార్థి వన పథకం కింద ఒక ఇంటిలో ఎంతమంది పిల్లలు చదువుకుంటే అంతమందికి సంవత్సరానికి రూ.15000 ఇస్తామన్నారు. నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతి కింద నెలకు రూ.3000 ఇస్తామన్నారు. వైసిపి పార్టీ మహిళలను వేధించే వారికి ఎంపీ ఎమ్మెల్యే టికెట్లు ఇస్తుందని విమర్శించారు. వైసిపి పాలనలో నిత్యవసర ధరలు పెరిగిపోవడంతో మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. వైసీపీ ప్రభుత్వం ఎనిమిది సార్లు కరెంటు చార్జీలను పెంచినట్లు తెలిపారు. టిడిపి అధికారంలోనికి వస్తే విద్యుత్ చార్జీలుపెంచబోమన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తాము అధికారంలోనికి వస్తే మధ్య నిషేధం చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చాక మద్యాన్ని తాకట్టుపెట్టి రూ.14 వేల కోట్లు అప్పు తెచ్చారని విమర్శించారు. మహిళలకు భద్రత కల్పించడంలో దేశంలో రాష్ట్రం 22వ స్థానానికి పడిపోయిందన్నారు. అరాచక పాలనకు రాక్షసపాలనకు ప్రజలు చమర గీతం పాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు కోట్ల సుజాతమ్మ, గౌరు చరిత, మాజీ జెడ్పిటిసి ప్రసన్న లక్ష్మి, మహేశ్వరి, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు
మహిళా సాధికారత టిడిపిలోనే సాధ్యం :బిసి ఇందిరా
టిడిపి పాలనలోనే మహిళల సాధికారత సాధ్యమని మాజీ ఎమ్మెల్యే బిసి జనార్దన్ రెడ్డి సతీమణి బిసి ఇందిర పేర్కొన్నారు. మహిళాశక్తి కార్యక్రమంలో భాగంగా మహిళా ప్రజా వేదిక ముఖాముఖి కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించాలన్నారు. టిడిపి పాలనలోనే మహిళలకు గుర్తింపు సాధ్యమన్నారు. డ్వాక్రా సంఘాలను ఏర్పాటు చేసి అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మహిళలను ఆర్థికంగా అభివృద్ధి చేశారని తెలిపారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తామ అధికారంలోకి వస్తే ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే ఎంతమందికి అమ్మబడి ఇస్తామని అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకరికి మాత్రమే రూ.13000 ఇస్తున్నారని తెలిపారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే పరిశ్రమలను ఏర్పాటు చేసి నిరుద్యోగ యువతీ ఒకరు ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్నారు రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యను పరిష్కరించాలని ఆమె కోరారు. బిడ్డల భవిష్యత్తు కోసం రాష్ట్ర భవిష్యత్తు కోసం వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం ప్రభుత్వాన్ని గెలిపించాలన్నారు.
చంద్రబాబుకు ఘన స్వాగతం
పట్టణంలోని జిఎంఆర్ ఫంక్షన్ హాల్ లో మహిళా శక్తి కార్యక్రమంలో భాగంగా మహిళా ప్రజా వేదిక మహిళలతో ముఖాముఖి కార్యక్రమానికి వచ్చిన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు టిడిపి నాయకులు ఘన స్వాగతం పలికారు. శుక్రవారం పట్టణంలోని జిఎంఆర్ ఫంక్షన్ హాల్ వద్దకు వచ్చిన చంద్రబాబు నాయుడుకు మాజీ ఎమ్మెల్యే బిసి జనార్దన్ రెడ్డి స్వాగతం పలికారు. టిడిపి జిల్లా అధ్యక్షులు మల్లెల రాజశేఖర్, ఎమ్మెల్సీ భీమ్ రెడ్డి రాంగోపాల్ రెడ్డి, నంద్యాల పార్లమెంట్ ఇన్చార్జి మాండ్రా శివానందరెడ్డి, మాజీ మంత్రి భూమా అఖిలప్రియ, కర్నూలు, ఆత్మకూరు, డోన్ టిడిపి నియోజకవర్గ ఇన్చార్జులు టిజి. భరత్, బుడ్డా రాజశేఖర్ రెడ్డి, ధర్మవరం సుబ్బారెడ్డిలు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుఘన స్వాగతం పలికారు.










