ప్రారంభోత్సవాన్ని అడ్డుకున్న రామకృష్ణాపురం మహిళలు
ప్రజాశక్తి - ఆరిలోవ :13వ వార్డు, కేంద్రకారాగారం ఎదురుగా రామక్రిష్ణాపురంలో నూతనంగా ఏర్పాటు చేయనున్న ప్రభుత్వ మద్యం దుకాణం ప్రారంభాన్ని స్థానికులు అడ్డుకున్నారు. విశాఖ కేంద్రకారాగారం ఎదురుగా రామక్రిష్ణాపురంలో బిఆర్‌టిఎస్ రోడ్డును ఆనుకొని ఉన్న ఓ వ్యక్తికి చెందిన రేకుల షెడ్డులో ప్రభుత్వ మద్యం దుకాణం ఏర్పాటుకు ఎక్సైజ్ శాఖ అధికారులు సోమవారం మధ్యాహ్నం మద్యం స్టాక్‌ను తీసుకు వచ్చి షెడ్డులో పెట్టారు. స్థానికులు ఈ విషయం గమనించి అక్కడ ఉన్న ఎక్సైజ్ అధికారులను అడిగారు. అక్కడ మద్యం షాపు ప్రారంభిస్తున్నట్టు తెలియడంతో జనావాసాల మధ్యం మద్యం దుకాణం వద్దంటూ అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఎక్సైజ్ అధికారులకు, స్థానిక మహిళలకు కొంతసేపు వాగ్వివాదం జరిగింది. ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా జనావాసాల మధ్య మద్యం దుకాణం ఏర్పాటును ఎట్టిపరిస్థితుల్లోనూ ఒప్పుకోబోమని మహిళలు అడ్డు తగిలారు. దశల వారిగా మద్యాన్ని నిషేధిస్తామన్న రాష్ట్ర ప్రభుత్వం, ఇలా కాలనీకొక మద్యం దుకాణం ఏర్పాటుతో విస్తరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేసారు. దీంతో అధికారులు షాపు షట్టర్ మూసేసి వెనుతిరిగారు.










