ప్రజాశక్తి - సత్తెనపల్లి రూరల్ : మద్యం దుకాణం నిర్మాణాన్ని రెంటపాళ్ల మహిళలు అడ్డుకున్నారు. మండలంలోని రెంటపాళ్ల నుండి ఫణిదం వెళ్లే మార్గంలో వైన్స్‌ను ఏర్పాటు చెయోద్దని మహిళలు సోమవారం అడ్డుకొని ఘోరావ్ చేశారు. క్రోసూరు రోడ్డు పెట్రోల్ బంక్ సమీపంలో కొన్ని సంవత్సరాలుగా వైన్స్ నడుపుతున్నారు. ఈ నేపథ్యంలో స్థల నిర్వాహకులు వైన్స్‌ను తీసివేయాలని సూచించారు. దీనితో వైన్స్ నిర్వాహకులు ఫణిదం మార్గంలో రోడ్డు పక్కన పొలంలో నిర్మించేందుకు ఇసుక, బాదులు తదితర వాటిని తరలించారు. సమీపంలో దేవాలయం, జనావాసాలు సమీపంలో వైన్స్‌ను ఎలా ఏర్పాటు చేస్తారని మహిళలు నిలదీశారు. ఇక్కడ వైన్స్ నిర్మాణ ప్రయత్నాన్ని విరమించుకోవాలని లేనిపక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో జమ్మలమూడి నాగమ్మ, మార్తమ్మ, బలిజేపల్లి మరియమ్మ, మేరీ మాత, జ్యోతి, నందిగం రజిని, కస్తూరి శ్రీదేవి పాల్గొన్నారు.










