Aug 01,2023 00:51
మద్యం దుకాణం ఎదుట ఆందోళన చేేస్తున్న సిపిఎం, ప్రజాసంఘాల నాయకులు

ప్రజాశక్తి-చీరాల: నిత్యం ప్రజలతో రద్దీగా ఉండే ప్రాంతం అయినా పట్టణ ప్రధాన కూడలి కూరగాయల మార్కెట్‌ వద్ద ప్రభుత్వం మద్యం దుకాణం ఏర్పాటు చేస్తే మహిళలు,విద్యార్థులు ఇబ్బందికరంగా ఉంటుందంటూ ప్రజాశక్తి దినపత్రికలో 'బడి.. మార్కెట్‌.. మధ్యలో మద్యం షాపు', 'పట్టణ నడి బొడ్డున 'ప్రభుత్వ' మద్యమా?' అంటూ శని సోమవారాల్లో స్థానికుల సమస్యలపై ప్రచురితమైన ప్రజాశక్తి కథనాలకు విశేష స్పందన కనిపించింది. సోమవారం కూరగాయల మార్కెట్‌ వద్ద ప్రభుత్వ మద్యం దుకాణాన్ని వ్యతిరేకిస్తూ ఆ ప్రాంతంలోని దుకాణ నిర్వాహకులు నిరసన చేపట్టారు. వీరికి మద్దతుగా సిపిఎం, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని దుకాణం సోమవారం ఎదుట నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆ ప్రాంతంలో కూరగాయల మార్కెట్‌, పచారీ దుకాణాలు అధికంగా ఉన్నాయని, మహిళలతో నిత్యం రద్దీగా ఉన్న ప్రదేశంలో మద్యం షాప్‌ ఏర్పాటును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా మని అన్నారు. ప్రభుత్వం తక్షణమే మద్యం షాప్‌ ఏర్పాటు పనులను నిలుపుదల చేయాలని, ప్రజలకు ఇబ్బంది కలిగిం చే విధంగా షాపు నిర్మాణం చేపడితే ఆందోళన తప్పదని, మద్యం షాపు నిర్మాణాన్ని తక్షణమే నిలిపివేయాలని వారు హెచ్చరించారు. ఈ మేరకు ఆ ప్రాంత వాసులందరూ సోమ వారం బాపట్ల జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో జరిగిన ఆ ప్రాంతవాసులు కలెక్టర్‌ రంజిత్‌ బాషాకు తమ సమస్యను వివరిస్తూ మద్యం దుకాణాన్ని తమ ప్రాంతంలో నిలిపివేయా లని కోరుతూ వినతిపత్రాన్ని అందజేశారు. అదేవిధంగా స్థానిక మున్సిపల్‌ కార్యాలయంలో ఎమ్మెల్యే కరణం బల రామకృష్ణమూర్తి దృష్టికి తమ సమస్యను తీసుకువెళ్లి తమ సమస్యను పరిష్కరించాలని కోరుతూ కమిషనర్‌ కార్యాల యంలో మున్సిపల్‌ చైర్మన్‌ శ్రీనివాసరావుకు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ నేపథ్యంలో సాయంత్రం మహిళలందరూ పెద్దఎత్తున నిర్మాణంలో ఉన్న ప్రభుత్వ మద్యం దుకాణం ఎదుట బైఠాయించి నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. తక్షణమే ప్రభుత్వ అధికారులు మద్యం దుకాణ ఏర్పాట్లను నిలిపివేసి మరోచోట ఏర్పాటు చేసుకోవాలని పేర్కొన్నారు. అనంతరం తహశీల్దారు ప్రభాకర్‌రావుకు వినతి పత్రాన్ని అందజేశారు. విషయం తెలుసుకున్న తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నాయకురాలు, పొన్నూరు మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ సజ్జ హేమలత స్థానికులకు మద్దతుగా నిలిచారు. తహశీల్దారు కార్యాలయం నుంచి ఆమె ర్యాలీగా వెళ్లి ఒకటో పట్టణ పోలీస్‌ స్టేషన్లో సీఐ మల్లికార్జున రావుకు ఫిర్యాదు చేశారు. ఆ ప్రాంతంలో మద్యం దుకాణాన్ని తొలగించాల న్నారు. అర్ధరాత్రి వేళలో మద్యం సరుకును షాపులో నింపాల ని నిర్వాహకులు చూస్తున్నారని, తమ ప్రాంత మహిళలకు రక్షణ కల్పిస్తూ షాపును తొలగించే విధంగా చర్యలు చేపట్టాలని వారు కోరుతూ వినతిపత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో సిపిఎం, ప్రజాసంఘాల నాయకులు ఎం బాబురావు, పి కొండయ్య, ఎల్‌ జయరాజు, ప్రజా వేదిక నాయకులు గుమ్మడి ఏసురత్నం, ఆ ప్రాంత వ్యాపారులు పచ్చి పులుసు వెంకటస్వామి, అమర ఆంజనేయులు, పెనుగొండ కిషోర్‌, పులిమి ఆదిశంకరరావు, గుంటూరు నారాయణ, చేబ్రోలు సురేష్‌ తదితరులు పాల్గొన్నారు.