Jun 17,2023 00:38

సెబ్ కార్యాల‌యం వ‌ద్ద ఆందోళ‌న చేస్తున్న నిందితుల బంధువులు

ప్రజాశక్తి-పిడుగురాళ్ల : మద్యాన్ని అక్రమంగా తరలించిన కేసులో ఇద్దరిపై కేసు నమోదు చేయాన్ని వ్యతిరేకిస్తూ వారి బంధువులు ఆందోళనకు దిగగా వారిపైనా కేసు నమోదు చేశారు. దీనిపై వివరాల ప్రకారం.. మాచవరం మండలం తురకపాలేనికి చెందిన షేక్‌ సమీర్‌ వద్ద ఈనెల 14 తేదీన తెలంగాణ రాష్ట్రానికి చెందిన 43 మద్యం సీసాలను స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో (సెబ్‌) అధికారులు పట్టుకున్నారు. వాటిని ఎక్కడి నుండి తెచ్చారో ఆరా తీయగా మాచవరం మండలం చెన్నాయపాలేనికి చెందిన నాగరాజు నాయక్‌, గోపి నాయక్‌ వద్ద కొనుగోలు చేసినట్లు తేలింది. దీంతో అధికారులు చెన్నాయపాలేనికి వెళ్లి గోపినాయక్‌, నాగరాజు నాయక్‌ కోసం గాలించగా వారు కనిపించలేదు. అయితే వారిపైనా కేసు నమోదు చేసినట్లు వారి కుటుంబీకులు, బంధువులకు తెలియడంతో పిడుగురాళ్లలోని సెబ్‌ స్టేషన్‌ ఎదుట శుక్రవారం ఆందోళనకు దిగారు. మద్యం వారి వద్ద దొరక్కపోయినా వారిపై కేసు ఎలా నమోదు చేస్తారని ప్రశ్నించారు. ఈ క్రమంలో సెబ్‌ అధికారులకు, ఆందోళనకారులకు మధ్య తోపులాట జరిగింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని ఆందోళనకారుల్లో నలుగుర్ని స్టేషన్‌కు తరలించారు. సెబ్‌ సిఐ కొండారెడ్డి ఫిర్యాదు మేరకు ఆందోళనకారులపై కేసు నమోదు చేశారు.