ప్రజాశక్తి-కాకినాడ ప్రతినిధి రాష్ట్రంలో సంపూర్ణ మధ్య నిషేధం అమలయ్యే విధంగా రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావుకు మద్యపాన వ్యతిరేక ప్రచార సమితి నాయకులు వినతి పత్రం అందజేశారు. కాకినాడలో ఆదివారం జరిగిన రాష్ట్రస్థాయి దళిత సదస్సులో పాల్గొన్న శ్రీనివాసరావును వారు కలిశారు. ఈ సందర్భంగా నాయకులు ఆయనతో మాట్లాడుతూ సమాజంలో రోజురోజుకీ దిగజారిపోతున్న నైతిక విలువలకూ, క్షీణించిపోతున్న మానవ సంబంధాలకు ఈ వినాశకర మహమ్మరే ప్రధాన కారణం అన్నారు. విద్యార్థులు, యువకులు, నిరుద్యోగులు, చిరుద్యోగులు, రైతుకూలీలు, రోజుకూలీలు, బడుగు వ్యాపారులు, బలహీనవర్గాల ప్రజలు... ఎంతోమంది మద్యానికి బానిసలై జీవితాలు నాశనం అవుతున్నాయన్నారు. ప్రజల బలహీనతని ప్రభుత్వాలు ప్రధాన ఆదాయ వనరుగా భాస్తున్నాయన్నారు. పొరుగు రాష్ట్రమైన కేరళలో ఈ మధ్యనే మద్యపాన నిషేదాన్ని ప్రకటించారన్నారు. కేరళను ఆదర్శంగా తీసుకోవాలన్నారు. వినతి పత్రం ఇచ్చిన వారిలో డాక్టర్ ఎన్.సూర్య నారాయణ, నాని బాబు, కె.విశ్వనాథం తదితరులు ఉన్నారు.










