
'ప్రజాశక్తి' కథనానికి స్పందించిన ఎంఎల్‌ఎ
ప్రజాశక్తి-ఆలమూరు
మడికి ప్రధాన రహదారికి కొత్తపేట ఎంఎల్‌ఎ చిర్ల జగ్గిరెడ్డి రూ. 40 లక్షలు మంజూరు చేసి, సిసి రోడ్డు నిర్మాణానికి శుక్రవారం భూమి పూజ చేశారు. మడికి గడప..గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ ఉండ్రాసపు లక్ష్మి మౌనిక చిన్నా అధ్యక్షతన వైసిపి మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాసు, ఎంపిపి తోరాటి లక్ష్మణరావు, ఎఎంసి ఛైర్మన్ యనమదల నాగేశ్వరరావు తదితరులతోకలిసి నిర్వహించారు. అధ్వానంగా ఉన్న మడికి రోడ్డుకు సంబంధించి 'అడుగుకో మడుగు' కథనం శుక్రవారం 'ప్రజాశక్తి'లో ప్రచురితమైంది.ఈ సందర్భంగా ఎంఎల్‌ఎ చిర్ల జగ్గిరెడ్డి మాట్లాడుతూ ఎన్నో ఏళ్ళుగా అభివృద్ధికి నోచుకోని ఈ రహదారికి నా చేతుల మీదుగా అభివృద్ధి చేసే అవకాశం ఇచ్చినందుకు ఆనందం వ్యక్తం చేశారు. ఈ రహదారిపై 'ప్రజాశక్తి'తో పాటుగా వివిధ పత్రికల్లో పలు కథనాలు వెలువడ్డాయని నిధుల కొరతతో ఇంతకాలం అభివద్ధి జరగలేదన్నారు. మొదటి విడతలో మడికి సెంటర్ జాతీయ రహదారి నుంచి మల్లావానితోట వరకు గల జెడ్‌పి రోడ్డు నిర్మాణానికి భూమి పూజ చేశారు. కార్యక్రమంలో వైసిపి నాయకులు పడమటి రాంబాబు, చెల్లబోయిన శ్రీనివాసు, మల్లెమొగ్గల చిన్న, ఉండ్రాసపు సుందర విజయం, డాక్టర్ యు.ప్రసాద్ బాబు, ఎంపిడిఒ జాన్ లింకన్, తహశీల్దార్ ఐపీ శెట్టి, పంచాయతీరాజ్ ఎఇ డి.వీరభద్రరావు, పంచాయతీ కార్యదర్శి కె.మోక్షాంజలి, తదితరులు పాల్గొన్నారు.
ఇళ్ల పట్టాలు పొందిన అందరికీ స్థలాలు
జగనన్న కాలనీలో ఇళ్ల పట్టా పొందిన ప్రతి ఒక్కరికి స్థలం అందజేస్తామని ఎంఎల్‌ఎ చిర్ల జగ్గిరెడ్డి అన్నారు. మండలంలోని బడుగువానిలంకలో 165 మంది లబ్ధిదారులకు సర్పంచ్ దూలం వెంకటలక్ష్మి సత్తిబాబు అధ్యక్షతన జరిగిన సభలో శుక్రవారం ఆయన ఇళ్ల పట్టాలతో పాటుగా స్థలాలు అందజేశారు. కార్యక్రమంలో ఎంపిపి తోరాటి లక్ష్మణరావు, జెడ్‌పిటిసి సభ్యురాలు తోరాటి సీతామహాలక్ష్మి, ఉప సర్పంచ్ పినమాల జ్యోతి తాతాజీ తదితరులు పాల్గొన్నారు.
మడికిలో గడప గడపకూ..
మండలంలోని మడికి సచివాలయం-1లో గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమాన్ని పార్టీ శ్రేణులతో కలిసి ఎంఎల్‌ఎ చిర్ల జగ్గిరెడ్డి శుక్రవారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ గడిచిన నాలుగున్నర ఏళ్ళుగా ఎన్నో అభివద్ధి పథకాలను ప్రవేశ పెట్టిన ఘనత ఒక్క వైసిపి ప్రభుత్వానికే సాధ్యమైందన్నారు. పేద ప్రజల సంక్షేమమే థ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు.