వేసవిలో మామిడిపండు తినకపోతే ఆశ్చర్య పోవాల్సిందే.. సీజనల్‌గా దొరికే మామిడిపండును ఎవ్వరూ వదిలిపెట్టరు. అయితే ఈ మామిడిపండును ముక్కలు కోసుకునో.. రసం కాయ అయితే జుర్రేసుకుని తినడం ఎవరైనా చేస్తారు. అదే ఆ పండుతో వెరైటీలుగా చేసుకుంటే.. పిల్లలు వావ్ అంటూ లొట్టలేసుకుంటూ తినేస్తారు. అవి ఏవేంటో.. ఎలా తయారుచేయాలో తెలుసుకుందాం..
కావలసిన పదార్థాలు : పాలు - కప్పు, ఫ్రెష్‌క్రీమ్ - మూడు కప్పులు, మామిడిపండు - ఒకటి, మ్యాంగో ప్యూరీ - కప్పు, కస్టర్డ్ పౌడర్ - టేబుల్ స్పూన్, వెనిలా ఎసెన్స్ - టీస్పూన్, చక్కెర - కప్పు
తయారుచేసే విధానం : ముందుగా పావు కప్పు పాలు తీసుకొని, కస్టర్డ్ పౌడర్ వేసి, ఉండలు లేకుండా చక్కగా కలిపి, పక్కన పెట్టుకోవాలి. మిగిలిన పాలను స్టవ్ మీద పెట్టి, చక్కెర వేయాలి. అది కరిగిన తర్వాత కస్టర్డ్ మిశ్రమం వేసి మరిగించాలి. కస్టర్డ్ మిశ్రమం చిక్కబడ్డాక దింపుకొని కాస్త చల్లారిన తరువాత మ్యాంగో ప్యూరీ, మామిడిపండు ముక్కలు, క్రీమ్, వెనిలా ఎసెన్స్ వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ఒక బౌల్‌లో పోసి, మూత పెట్టి ఫ్రిజ్‌లో ఉంచాలి. అది గడ్డకట్టిన తర్వాత తీసి సర్వ్ చేసుకోవాలి.
మింట్ పన్నా
కావలసిన పదార్థాలు : మామిడిపండు ముక్కలు - కప్పు, పుదీనా ఆకులు - పావు కప్పు, చక్కెర - 1/4 కప్పు, ఐస్ ముక్కలు - అర కప్పు
తయారుచేసే విధానం : మామిడిపండు దోరగా పండినది తీసుకోవాలి. దీన్ని చెక్కు తీసి, చిన్నచిన్న ముక్కలు చేసుకోవాలి. వీటిని కుక్కర్లో వేసి, రెండు కప్పుల నీళ్ళు పోయాలి. మెత్తగా ఉడికిన తర్వాత చల్లారనివ్వాలి. దీనిలో పుదీనా ఆకులు, చక్కెర వేసి మిక్సీలో మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి. ఒక గ్లాసులో ఐస్ ముక్కలు వేసి దానిపైన ఈ పన్నా పోయాలి. చిన్న పుదీనా కొమ్మతో గార్నిష్ చేసి, చల్లగా సర్వ్ చేయాలి.
ఫాలూదా
కావలసిన పదార్థాలు : మామిడిపండు- ఒకటి, పాలు -కప్పు, చక్కెర - రెండు టేబుల్ స్పూన్లు, సేమియా- పావు కప్పు, సబ్జా గింజలు- టీస్పూన్, మ్యాంగో జామ్ - టేబుల్ స్పూన్, ఐస్‌క్రీం - కప్పు.
తయారుచేసే విధానం : మామిడిపండు గుజ్జు తీసి పెట్టుకోవాలి. పాలు కాచి, చల్లార్చి ఫ్రిజ్‌లో పెట్టాలి. సేమియాను కొద్దిగా వేయించి, నీళ్లుపోసి ఐదు నిమిషాలు ఉడికించాలి. అందులో నీళ్లు వంపేసి చల్లార్చుకోవాలి. సబ్జా గింజల్లో నీళ్లుపోసి, పావుగంట నానబెట్టాలి. ఇప్పుడు ఒక గ్లాస్‌లో సబ్జా గింజలు, సేమియా, చక్కెర, మామిడిపండు గుజ్జు వేసి, పాలు పోయాలి. ఈ మొత్తం మిశ్రమాన్ని బాగా కలపాలి. మ్యాంగో జామ్, ఐస్‌క్రీమ్‌తో గార్నిష్ చేసుకోవాలి. అంతే చల్లచల్లగా నోరూరించే మ్యాంగో ఫాలూదా రెడీ!
తాండ్ర
కావలసిన పదార్థాలు : మామిడిపండు ముక్కలు - రెండు కప్పులు, పంచదార - కప్పు, ఏలకుల పొడి - అర టీ స్పూను, నెయ్యి - 2 టేబుల్ స్పూన్లు
తయారుచేసే విధానం : మామిడిపండు ముక్కలను మిక్సీలో వేసి, మెత్తగా బ్లెండ్ చేసి ఒక పాత్రలోకి తీసుకోవాలి. స్టౌ మీద పాన్ ఉంచి, వేడయ్యాక మామిడిపండు గుజ్జు వేసి, ఆపకుండా కలపాలి. ఏలకుల పొడి వేయాలి. పంచదార వేసి, మిశ్రమం బాగా చిక్కబడే వరకూ కలుపుతూ ఉండాలి. ఒక పెద్ద ప్లేట్‌కి నెయ్యి రాసి, ఉడికిన మామిడిపండు గుజ్జును పోయాలి. దీన్ని సమంగా పరిచి, పైన మూత ఉంచి సుమారు పది గంటల సేపు వదిలేయాలి. ఆ తరవాత చాకుతో కట్ చేసుకోవాలి.
పూరీలు
కావలసిన పదార్థాలు : గోధుమ పిండి - 2 కప్పులు, మామిడిపండు గుజ్జు - అర కప్పు, ఉప్పు - చిటికెడు, యాలకుల పొడి- చిటికెడు, చక్కెర - 3 టేబుల్ స్పూన్లు, నూనె - వేయించడానికి సరిపడా.
తయారుచేసే విధానం : ముందుగా మామిడిపండ్ల ముక్కలు, యాలకుల పొడి, చక్కెర కలిపి మిక్సీలో గుజ్జులా చేసుకోవాలి. ఒక గిన్నెలో మామిడి గుజ్జు, జల్లించిన గోధుమపిండి వేసి, పూరీపిండిలా కలుపుకోవాలి. అవసరమైతే కొద్దిగా నీళ్లు పోసి, కలుపుకోవచ్చు. తడిపిన పిండి తడిబట్టతో కప్పి, అరగంటసేపు ఉంచాలి. తర్వాత పిండిని బాగా కలపాలి. చిన్న చిన్న ఉండలు చేసుకొని, పూరీలుగా వత్తుకోవాలి. పాన్‌లో నూనె వేడి చేసి, ఈ పూరీలను రెండువైపులా బంగారు రంగు వచ్చేవరకూ వేయించాలి. వేడివేడి మ్యాంగో పూరీలపై చక్కెర చల్లుకొని, తింటే భలే బాగుంటాయి.