Oct 05,2023 21:19

మృతదేహాన్ని బయటకు తీస్తున్న గ్రామస్తులు

ప్రజాశక్తి- రేగిడి : కుటుంబ పోషణలో ఉపాధి కోసం వచ్చి మడ్డువలస కుడి ప్రధాన కాలువలో స్నానం చేయడానికి దిగి ప్రమాదవశాత్తు జారిపడి వ్యక్తి మృత్యువాత పడిన ఘటన పలువురిని కంట తడి పెట్టించింది. కాలువ వద్ద చెప్పులు, బట్టలు ఆనవాళ్ళతో పొందూరు మండలం లోలుగు గ్రామానికి చెందిన నవిరి సుదర్శన్‌గా గుర్తించారు. పోలీసులు, రెవెన్యూ అధికారి సమాచారం మేరకు రేగిడి మండలం పోరాం గ్రామ సమీపం మడ్డువలస కాలువలో పడి పొందూరు మండలం లోలుగు గ్రామానికి చెందిన నవిరి సుదర్శన్‌ (28) గురువారం మృతి చెందారు. పోరాం గ్రామానికి చెందిన బూరాడ విష్ణుమూర్తి వద్ద కారు డ్రైవరుగా పనిచేస్తున్న నవిరి సుదర్శన్‌ ఆ గ్రామ సమీపంలో గల మడ్డువలస కాలువకు స్నానానికి వెళ్ళగా ప్రమాదవశాత్తు కాలుజారి నీటిలో మునిగిపోయారు. అక్కడకు వ్యవసాయ కూలీలు స్నానానికి వచ్చి చెప్పులు, బట్టలు చూసి స్నానానికి దిగిన వ్యక్తి కనిపించక పోవడంతో పోలీసులకు, ఫైర్‌ సిబ్బందికి సమాచారం అందిం చారు. ఫైర్‌ సిబ్బంది లైఫ్‌ జాకెట్లు వేసుకొని కాలువలో వెతకగా సుమారు 30 మీటర్లు దూరంలో సుదర్శన్‌ శవమై తేలేడు. విఆర్‌ఒ సత్యనారాయణ, పోలీస్‌ సిబ్బంది, కుటుంబ సభ్యుల సమక్షంలో పంచినామా నిర్వహించారు. పోస్టుమార్టం కోసం రాజాం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతునికి తల్లిదండ్రులు, భార్య అరుణ ఉన్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ శ్రీనివాసరావు తెలిపారు.