సీతంపేట: గిరిజనులు ఆరుగాలం శ్రమించి సేకరించిన అటవీ ఉత్పత్తులకు మార్కెట్ ధర లేక గిరిజనులు విలవిలలాడుతున్నారు. సీతంపేట ఏజెన్సీలో ప్రతి ఉత్పత్తి నాణ్యతగా ఉంటుందని మైదాన ప్రాంత వాసులు ఉత్పత్తులపై ఎగబాకుతారు. కానీ ఉత్పత్తులు కొనుగోలు చేసినప్పుడు దళారులు సిండికేట్‌గా మారి కారుచౌకగా కొనుగోలు చేస్తారు. దీంతో గిరిజనులు నష్టాలు చవిచూస్తున్నారు. సీతంపేట ఏజెన్సీలో కొండచీపుర్లు అంటే మైదాన ప్రాంత వాసులు ఇష్టపడతారు. కొండ చీపుర్లు నాణ్యతగా, సున్నితంగా, నాజూగ్గా ఎక్కువ కాలం మన్నిక వస్తుంది. అందుకే పట్టణవాసులు మొగ్గుచూపుతారు. అయితే సీతంపేట ఏజెన్సీలో సుమారు 3వేల హెక్టార్ల వరకు కొండచీపుర్లు గిరిజనులు వేస్తున్నారు. ఈ కొండ చీపుర్ల పంట పూతికవలస, మర్రిపాడు, దోను బాయి, శంభం, పొల్ల, కుసిమి పరిసర ప్రాంతాల్లో ఎక్కువగా పండుతుంది. జనవరి, ఫిబ్రవరి, మార్చిలో ఎక్కువగా పండుతుంది. అయితే అప్పట్లో మార్కెట్ ధర పలకదన్న ఉద్దేశంతో కొంత మంది అప్పట్లో నిల్వ ఉంచి జూలై, ఆగస్టులో మార్కెట్ ధర మరింత ఎక్కువ పలుకుతుందన్న ఉద్దేశంతో సోమవారం జరిగే సీతంపేట సంతకు ఆదివారం మధ్యాహ్నం కొండసీపుర్లు విక్రయించడానికి సంత మార్కెట్‌కు తీసుకొచ్చారు. అయినా మార్కెట్ ధర పడి పోవడంతో గిరిజనులు ఆందోళన చెందుతున్నారు. ఒక్కొక్క కొండ చీపురు రూ.40లోపే ధర పలుకుతుంది. విశాఖపట్నం, రాజమండ్రి, పర్లాకిమిడి, ఒడిశాలోని కటక్, విజయవాడ, తదితర పట్టణాల నుంచి దళారులు సంతకు వస్తాయి. మార్కెట్లో ధర లేకపోవడం సిండికేట్‌గా మారడంతో గిరిజన నష్టాలు చవిచూస్తున్నారు. దీనిపై జిసిసి మేనేజర్ దాసరి కృష్ణ వద్ద ప్రస్తావించగా జనవరి నుంచి ఏప్రిల్ వరకే దీనికి సీజన్ ఉంటుందని, అప్పట్లో ఏ గ్రేడ్ రూ.45, బి గ్రేడ్ రూ.40, సి గ్రేడ్ రూ.35కు కొనుగోలు చేశామని తెలిపారు. ప్రస్తుతం సీజన్ కాదు గనుక కొనుగోలు చేయడం లేదని సమాధానం ఇచ్చారు.










