Apr 11,2023 00:37
ఎంపిడిఓ కు వినతిపత్రం అందజేస్తున్న నాయకులు

ప్రజాశక్తి-భట్టిప్రోలు: ఈ ఏడాది రబీ సీజన్‌లో రైతులు అధిక మొత్తంలో మొక్కజొన్న పంటను సాగు చెయ్యగా పంట చేతికందే సమయంలో వ్యాపారులు సిండికేట్‌గా మారి రోజు రోజుకూ ధరను తగ్గిస్తున్న దృష్ట్యా ప్రభుత్వం మార్కెఫెడ్‌ ద్వారా మద్దతు ధరకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేస్తూ ఏపి రైతు సంఘం ఆధ్వర్యంలో మండల తహసీల్దార్‌ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. రైతు సంఘం బాపట్ల జిల్లా అధ్యక్షులు వేములపల్లి వెంకట్రామయ్య, మండల అధ్యక్షులు కె రామస్వామి మాట్లాడుతూ ప్రస్తుతం పంట చేతికందే దశకు చేరుకోగా నిన్న, మొన్నటి వరకు క్వింటా రూ.2,200 ధర ఉండగా నేడు రూ.1,900కు మాత్రమే కొనుగోలు చేస్తున్నారని, దీనివలన రైతులు ఎకరాకు రూ.15 వేలకు పైగా నష్టపోవలసి వస్తోందని అన్నారు. పెరిగిన ఖర్చులను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వ మద్దతు ధర రూ.1,960కి కొనుగోలు చేసే విధంగా కేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోతే వ్యాపారులు ధరలో మరింత కోత విధించి రైతులను దోచుకునే పరిస్థితి ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు జి సుధాకర్‌, ఎం సత్యనారాయణ, జి నాగరాజు, దీపాల సత్యనారాయణ, మండవ నాగేశ్వరరావు, వేములపల్లి రమేష్‌ తదితరులు ఉన్నారు.