ప్రజాశక్తి -తాళ్లరేవు
మద్దతు ధరకే ధాన్యం కొనుగోలు చేయాలని ఎపి కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి వల్లు రాజబాబు డిమాండ్ చేశారు. మండలంలో చిన్న బాపనపల్లి, లచ్చిపాలెం పెదబాపనపల్లి, తంగేడు పంపు, కాజులూరు మండలం పల్లిపాలెం గ్రామాలలో సందర్శించి ఆ పొలం గట్లపై ఉన్నటువంటి ధాన్యం రాశులను పరిశీలించి రైతులను ధాన్యం అమ్మకాలపై పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. తంగేడు పంపులో గుత్తుల సుబ్బారావు, రెడ్డి లోవరాజు మాట్లాడుతూ ధాన్యం ఆరబెట్టి వారం రోజులు పైబడి కావస్తున్న ప్రభుత్వం కొనక పోవడం వల్ల ప్రైవేటు వ్యక్తులను ఆశ్రయించడం వల్ల బస్తాకు రూ. 200లు నష్టం వస్తుందని ఆ విధంగా పది ఎకరాల రైతుకు సుమారు లక్ష న్నర రూపాయలు నష్టపోవాల్సి వస్తుందని రైతులు రాజబాబుకు తెలిపార న్నారు. ధాన్యం కొనుగోలు లేక, మద్దతు ధర రాక ,ఇటు మిల్లర్లకు తక్కువ ధరకు అమ్ముకోలేక ధాన్యాన్ని ఏమి చేయాలో దిక్కు తోచని పరిస్థితిలో రైతులు ఉన్నారన్నారు. ప్రభుత్వం ద్వారా వెళ్లిన ధాన్యాన్ని మిల్లుల వద్ద మూడు రోజుల వరకు దించుకోవడంలేదని, ప్రైవేటు వ్యక్తుల ద్వారా వెళ్లిన ధాన్యాన్ని వెంటనే దించుతున్నారని రైతులు గగ్గోలు పెడుతున్నారని అన్నారు. తాళ్లరేవులో మండల స్థాయి అధికారులు సమావేశంలో 90 ట్రాక్టర్లు , వేలాది సంచులు అందజేస్తామన్న మాటలు ఆచరణలో లేవని ధాన్యాన్ని వర్షాల బారి నుండి కాపాడలేకపోతున్నారని యుద్ధ ప్రాతిపదికన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఆయన వెంట రైతులు, కౌలు రైతులు ఉన్నారు.
ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలంటున్న రాజబాబు, రైతులు










