May 23,2023 22:41

జాయింట్‌ కలెక్టర్‌ ఎస్‌ ఇలాక్కియా


అపోహలు నమ్మొద్దు : జెసి ఇలాక్కియా
ప్రజాశక్తి - కాకినాడ
కాకినాడ జిల్లాలో రబీకి సంబంధించి ఆర్‌బికెల ద్వారా మద్దతు ధరకు ధాన్యం కొనుగోళ్లు సజావుగా, వేగవంతంగా జరుగుతున్నాయని రైతులు తమ ధాన్యాన్ని బయట తక్కువ ధరకు అమ్ముకుంటున్నారన్న వార్తల్లో నిజం లేదని జిల్లా జాయి ఎస్‌.ఇలాక్కియా మంగళవారం ఓ ప్రకటనలో స్పష్టం చేశారు. ఇప్పటి వరకు 7,141 మంది రైతుల నుంచి రూ. 107.65 కోట్ల విలువైన 52,758 మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని ఆర్‌బీకేల ద్వారా కొనుగోళ్లు జరిగాయని, ఇప్పటికే రైతుల ఖాతాల్లో రూ. 81.95 కోట్ల మేర ధాన్యం సొమ్ము జమ అయినట్లు తెలిపారు. 10 నుంచి 21 రోజుల లోపు ధాన్యం సొమ్ము నేరుగా రైతుల ఖాతాల్లో జమవుతున్నట్లు వెల్లడించారు. రైతులకు రూ.1,530 మద్దతు ధర అందుతోందని అవసరం మేరకు రవాణా వాహనాలు సమకూర్చు తున్నట్లు తెలిపారు. జిల్లాలో రబీ (2022-23) సీజన్‌లో ఎంటీయూ 3626 రకాన్ని ఎక్కువగా సాగుచేశారని ఈ రకం ధాన్యానికి బయట మార్కెట్‌లో ఎంఎస్‌పి కంటే ఎక్కువ ధర రావడం వల్ల రైతులు ఓపెన్‌ మార్క్‌ట్‌లో అమ్ముకునేందుకు మొగ్గు చూపుతున్నారన్నారు. అంతేగానీ బయట మార్కెట్లో ఎంఎస్‌పీ కంటే తక్కువకు ధాన్యాన్ని రైతులు అమ్ము కుంటున్నారనే వార్తల్లో వాస్తవం లేదన్నారు. రైస్‌ మిల్లులకు ప్రత్యేకంగా కస్టోడియన్‌ అధికారులను నియమించామని గరిష్టంగా 24 గంటలలోపే అన్‌లోడింగ్‌ జరిగేలా పటిష్ట చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు. అధిక నూక శాతం పేరు చెప్పి రైతుల నుంచి నగదును వసూలు చేస్తున్న రెండు మిల్లులకు నోటీసులు ఇచ్చి, వాటిని సీఎంఆర్‌ ఆపరేషన్స్‌ నుంచి తొలగించినట్టు తెలిపారు. అకాల వర్షాల సమయంలో ధాన్యానికి ఇబ్బంది లేకుండా ముందస్తు రక్షణ చర్యలు తీసుకు న్నామని అయినాసరే ఎక్కడైనా ధాన్యం తడిసి ఉంటే వాటిని కూడా కొను గోలు చేసినట్లు వివరించారు. దెబ్బతిన్న, రంగుమారిన, మొలకెత్తిన 1,006 టన్నుల మేర ధాన్యం కొనుగోలుకు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. తమ ధాన్యాన్ని కొనుగోలు చేయాలని అడిగిన ప్రతి రైతు నుంచి పూర్తిస్థాయిలో ధాన్యం కొనుగోలు చేస్తున్నామని ఈ విషయంలో ఎలాంటి అపోహలు వద్దని, దళారుల ప్రమేయం లేకుండా ఆర్‌బికెల ద్వారా ధాన్యం కొనుగోలు విధానాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని రైతులకు జాయింట్‌ కలెక్టర్‌ ఇలాక్కియా సూచించారు.