Nov 09,2022 21:40

సివిల్‌ సప్లయీస్‌ కార్పొరేషన్‌ ఎమ్‌డి వీరపాండ్యన్‌
ప్రజాశక్తి - ఉంగుటూరు

ధాన్యానికి మద్దతు ధర అందించే లక్ష్యంతో ప్రభుత్వం నూతన విధానాన్ని అమలు చేస్తూ రైతుభరోసా కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు చేపట్టనుందని రాష్ట్ర సివిల్‌ సప్లయీస్‌ కార్పొరేషన్‌ ఎమ్‌డి జి.వీరపాండ్యన్‌ అన్నారు. బుధవారం మండలంలో చేబ్రోలు, నారాయణపురం, ఉంగుటూ రులోని ఆర్‌బికెలు, ధాన్యం కల్లాలను ఆయన పరిశీలించారు. తొలుత చేబ్రోలు, నారాయణపురంలో రైతులు ఆరబెట్టిన ధాన్యం రాశులను పరిశీలించారు. నారాయణపురంలో పలువురు రైతులు మాట్లాడుతూ వారంరోజుల నుంచి ధాన్యం ఆరబెడుతున్నామని, వాతావరణం ఎప్పుడెలా ఉంటుందో తెలియడం లేదని, ధాన్యం కొనుగోలు ఇప్పటికే ప్రారంభించాల్సి ఉందన్నారు. తేమ శాతం 17లోపు రావాలంటే పది, పన్నెండు రోజులు పైనే పడుతోందని, దీంతో బరకాలకు డిమాండ్‌ పెరిగి అద్దె రూ.20 నుంచి రూ.40, కూలీల ఖర్చు పెరిగి ఆర్థిక భారమవుతుందని తెలిపారు. వెంటనే ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించాలని కోరారు. శాంపిళ్ల సేకరణ ఉదయం 11 దాటాక తీయాలని రైతులు కోరారు. గడిచిన సీజన్‌లో హమాలీ ఛార్జీలు ఇంతవరకూ ఇవ్వలేదని వాపోయారు. దీనిపై ఎమ్‌డి మాట్లాడుతూ ధాన్యం తోలిన 21 రోజుల్లోపే రవాణా, హమాలీ కూలీల ఖర్చులను కలిపి సంబందిత రైతు ఖాతాకు జమచేయనున్నామని రైతులు ఆందోళన చెందవద్దన్నారు. అనంతరం ఉంగుటూరు రైతుభరోసా కేంద్రంలో రైతులతో ఆయన సమావేశం నిర్వహించారు. రైతుల సంక్షేమం కోసమే ధాన్యం సేకరణలో కొత్త నిబంధనలు తీసుకువచ్చామన్నారు. ట్రక్‌ షీట్‌, ధాన్యం తోలిన తర్వాత ఏ రైస్‌మిల్లుకు చేరాలో అంతా కంప్యూటర్‌ ఆధారంగా జరుగుతుందన్నారు. సంచులు, ట్రాన్స్‌ పోర్టు, హమాలీ ఖర్చులు రైతులే పెట్టుకుంటే ఆ విషయాన్ని ముందుగా ఖచ్చితమైన వివరాలతో ఆర్‌బికెల్లో నమోదు చేయించుకోవాలని, అప్పుడు మాత్రమే సొమ్ములు పడతాయన్నారు. నూతన విధానానికి రైతుల సహకరించాలని కోరారు. సంచికి రూ.3.70, వంద కేజీల బస్తాకు హమాలీ ఛార్జి రూ.100 చెల్లించనున్నామని ఆయన రైతులకు వివరించారు. ఈ కార్యక్రమంలో జెసి అరుణ్‌బాబు, జిల్లా కో ఆపరేటివ్‌ అధికారి ప్రవీణ, సివిల్‌ సప్లయీస్‌ సంస్థ జిల్లా మేనేజర్‌ మంజుభార్గవి, జిల్లా వ్యవసాయ సంచాలకులు వై.రామకృష్ణ, భీమడోలు ఎడిఎ పి.ఉషారాజకుమారి, జిల్లా వ్యవసాయ మండలి ఛైర్మన్‌ వి.వెంకటేశ్వరరావు, నారాయణపురం సొసైటీ ఛైర్‌పర్సన్‌, జిల్లా వ్యవసాయ సలహా మండలి సభ్యులు పాపారావుబాబ్జీ, తహశీల్దారు ఎవి.రమణారావు, ఎంపిడిఒ ప్రేమాన్విత పాల్గొన్నారు.