Jan 09,2023 22:58

ప్రజాశక్తి - భీమడోలు
              పొలసానిపల్లి గ్రామానికి చెందిన తెలుగు సాహితీవేత్త, కవి డాక్టర్‌ మద్దాల పెద్దిరాజు అంతర్రాష్ట్ర స్థాయిలో గుర్తింపు పొందటం అభినందనీయమని సర్పంచి షేక్‌ రహీమా బేగం హసేన అన్నారు. డాక్టర్‌ మద్దాల పెద్దిరాజు సామాజిక స్పృహ కల్పించే కవిత్వం, వ్యాసాల రచన, వృత్తి రీత్యా ఉపాధ్యాయులకు రావడంతో విద్యార్థులకు తెలుగు భాషాభిరుచిని కలిగించే సృజనాత్మక కార్యక్రమాలు నిర్వహించడం కారణంగా తెలుగుతేజం జాతీయ విశిష్ట సేవా పురస్కారం-2023కు ఎంపికయ్యారని సర్పంచి తెలిపారు. ఈ మేరకు తెలంగాణ రాష్ట్రానికి చెందిన నల్గొండ జిల్లా చిట్యాల వేదికగా పనిచేస్తున్న పుడమి సాహితీ వేదిక నాలుగో వార్షికోత్సవం పురస్కరించుకుని డాక్టర్‌ మద్దాల పెద్దిరాజు సాహితీ రంగానికి చేస్తున్న విశేష కృషికి గుర్తింపుగా సదరు అవార్డును స్వీకరణకు ఎంపిక చేశారన్నారు. ఈ మేరకు ఆదివారం చిట్యాలలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో పుడమి సాహితీ వేదిక ఛైర్మన్‌ డాక్టర్‌ చిలుముల బాల్‌ రెడ్డి అప్పటి పూర్వ కవులు ఏనుగు లక్ష్మణకవి, శ్రీనాధ మహాకవి, గిడుగు రామ్మూర్తి పంతులు, కవయత్రి మొల్లల ప్రస్తుత వారసులుగా కొనసాగుతున్న నలుగురు ప్రముఖులతో కలిపి డాక్టర్‌ మద్దాల పెద్దిరాజును సత్కరించి అవార్డును అందించారని తెలిపారు. ఈ మేరకు తనకు ప్రదానం చేసిన అవార్డుతో పొలసానపల్లి సర్పంచి దంపతులను డాక్టర్‌ మద్దాల పెద్దిరాజు సోమవారం వారి నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా తెలుగు భాషాభివృద్ధికి మరింతగా కృషి చేయాలని సర్పంచి దంపతులు డాక్టర్‌ మద్దాల పెద్దిరాజును కోరారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ పారిశ్రామికవేత్త షేక్‌ హసేన పాల్గొన్నారు.