
తలకు చుట్టిన తువాలు తీసి దులిపి, గబగబా మొహం తుడుచుకొని భుజం మీద వేసుకున్నాడు రామకృష్ణ. మరొకసారి నోటీసుబోర్డు వైపు చూశాడు. అతని కళ్లు బైర్లు కమ్మాయి. కాళ్ల కింద భూమి కుంగిపోతున్నట్లు అనిపించింది. నోటీసుబోర్డు వైపు అలా చూస్తూ నోట మాటరాక అచేతనంగా ఉండిపోయాడు.
మార్కెట్ యార్డులో వ్యాన్ పార్క్‌చేసి వచ్చిన డ్రైవర్ రామకృష్ణ వైపు, నోటీసుబోర్డు వైపు మార్చి మార్చి చూసి, గబగబా మంచినీళ్ల సీసా తెచ్చిచ్చాడు.
కొంచెం నీళ్లుతాగి, సీసా డ్రైవర్‌కి ఇస్తూ 'చూడవయ్యా, ఈ రేటుకి నా సరుకంతా అమ్మినా కనీసం పెట్టుబడి కూడా రాదు. ఇప్పుడేం చెయ్యాలి?'. నిశ్చేష్టుడై నిల్చున్న రామకృష్ణ మనసులో ఆలోచనలు తొలిచేస్తున్నాయి. తను ఊహించుకున్నదంతా తలక్రిందులైంది..
ఇప్పుడెలా? ఒకపక్క అప్పుల వాళ్ల ఒత్తిడి. ఇన్నాళ్లూ గౌరవంగా బతికిన తనని బాకీ కోసం చులకనగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు కొంతైనా జమ చేస్తానన్న మాట నిలబెట్టుకోలేదు తను. ఇవాళ్టితో తన పరువు అంతా మంటగలిసిపోతోంది. ఇన్ని కష్టాలూ తనకే ఎందుకు? తనేం తప్పు చేశాడని, ఉన్నదాంట్లో అన్నీ మంచి పనులే చేశాడు తాను, ఆస్తంతా కరగబెట్టి అందరికీ సాయం చేశాడు. మంచిగా ఉంటే ఇన్ని కష్టాలా? మోసాలు, దగాలు చేసే వాళ్లంతా బాగానే ఉన్నారే! సంఘంలో డబ్బుంటేనే మనిషికి గౌరవం ఇస్తారా? 'ఒకప్పుడు రామకృష్ణ గారు! మీ వల్లే మన ఊరికి ఇంత పేరండి, మీరు ఏంతో మందికి స్ఫూర్తండి' అని తనని అంత ఎత్తుకి ఎత్తేసిన వాళ్లు ఈరోజు ఏమయ్యారు? ఇప్పుడు తన దగ్గర డబ్బు లేకపోయేసరికి ఒక్కసారే కనుమరుగైపోయారే. సాయం చెయ్యక్కరలేదు, కనీసం పలకరించేవాళ్లు కరువయ్యారు. ఇప్పుడు ఊళ్ళో తనెవరో అన్నట్లుగా.. ఏమిటీ లోకం?
నేలతల్లిని నమ్ముకుంటే తన బిడ్డలకి అన్యాయం చేయదు అంటారు. అది నిజం కాదేమో, గత మూడేళ్ల నుంచీ వరుసగా ప్రకృతి వల్లే నష్టపోయాడు రామకృష్ణ. అంతా అయిపోయింది. భవిష్యత్తులో ఈ ఈతి బాధల నుండి బయటపడగలనన్న నమ్మకం లేదు. తనింకేమీ చెయ్యలేడు. తను చెయ్యగలిగిందల్లా ఒకటే.. అవును.. ఈ బాధలన్నిటి నుండీ బయటపడాలంటే ఇక ఒకటే మార్గం. ఒక నిర్ణయానికి వచ్చినవాడిలా మార్కెట్‌యార్డ్ బయటకు నడిచాడు రామకృష్ణ. అతని అడుగులు తడబడుతున్నాయి. చూపులు నేలను తాకుతున్నాయి. అటూ ఇటూ వచ్చిపోయే వాహనాల రణగొణ ధ్వనులేమీ తనకు వినిపించడం లేదు.
'ఓరు రామకృష్ణా! మజ్జానంకి నువ్వు సెప్పిన రెండు భోజనాల్లోకి బొచ్చలిగురు కూడా రెడీ సెయ్యమంటావేటి? ఫ్రెస్ సేపలు, ఇప్పుడే వొచ్చాయి' మార్కెట్‌యార్డ్ బయట ఉన్న ఏకైక కమ్మలపాక హోటల్ ఓనర్ అప్పలస్వామి కేకేస్తున్నా, రామకృష్ణ చెవులకి వినిపించడం లేదు.
నడుస్తున్నవాడల్లా ఆగి, అమ్మాజీకి ఫోన్ చేద్దాం అనుకుంటూ లుంగీ పైకెత్తి లోపల ప్యాంట్ జేబులోంచి సెల్‌ఫోన్ బయటకు తీశాడు. 'అసలే కంగారుమనిషి, అమ్మాజీతో ఏ విషయమూ చెప్పకూడదు. శ్రావణీకి చేద్దాం.. ఊహూ.. శ్రావణీకీ వద్దు.. అనవసరంగా ఆమె మనసు బాధపెట్టాలి. తర్వాత ఎలాగూ తప్పదు. మళ్లా సెల్‌ఫోన్ జేబులో పెట్టేసుకున్నాడు.
చెలరేగుతున్న ఆలోచనలతో అక్కడికి దగ్గర్లోని నేలబావి దగ్గరికి గబగబా చేరుకున్నాడు. బావిలోకి తొంగిచూశాడు. పీకల వరకూ నీటితో నిండుగా కుండలా ఉంది. ఒకసారి చుట్టూ కలియజూశాడు. చుట్టుపక్కల జనసంచారమేమీ లేదు. అక్కడక్కడ పశువులు మేత మేస్తున్నాయి. దూరంగా చెట్టు నీడన పశువుల కాపర్లు కూర్చొని, మాట్లాడుకుంటున్నారు.
కళ్లు మూసుకొని గట్టిగా ఊపిరి పీల్చి వదిలాడు. స్థిరమైన నిర్ణయానికి వచ్చినట్లు రెండడుగులు ముందుకి వేశాడు.. ఏదో జ్ఞాపకం వచ్చినవాడిలా ఆగాడు. షర్టు జేబులో ఉన్న చిన్నపాకెట్ పుస్తకంలోంచి ఒక కాగితాన్ని చింపి, అక్కడే చతికిలబడ్డాడు. వణుకుతున్న చేత్తో రాస్తూ... రాస్తూ.. మెల్లగా గతంలోకి జారుకున్నాడు.
***
తను శంఖవరం ఊళ్లో బాగా పేరున్న రైతు. తాతల కాలంలో తమది పెద్ద భూస్వాముల కుటుంబం. రానురాను ఆస్తులు, భూములు తరిగిపోయి, తన చేతికొచ్చేసరికి పదిహేను ఎకరాల పొలము, పెద్ద పెంకుటిల్లు మాత్రమే మిగిలాయి. అప్పులేమో పెరిగిపోయి, ఐదెకరాలే మిగిలింది. ఇప్పుడు తన దగ్గర చిల్లిగవ్వ లేదు. వాస్తవంగా అయితే తన పరిస్థితి పూర్తిగా దిగజారిపోయింది. ఇప్పుడు ఆర్థికంగా తనను తాను నిలదొక్కుకోడానికి సతమతమవుతున్నాడు. అందుకు కారణం లేకపోలేదు.
ఒకరోజు ఉదయం తను ఎరువులు కొనడానికి బజారుకెళ్లి వస్తుంటే, ఐదో తరగతి చదివే ఒక అబ్బాయి స్కూలు మధ్యలో ఏడ్చుకుంటూ రావడం గమనించి, ఎందుకని అడిగాడు. పుస్తకాలు తీసుకురాలేదని టీచర్ స్కూల్ నుంచి పంపేశారని, తనకి తండ్రి లేడని, తల్లి కూలి పనిచేస్తుందని చెప్పాడు. తన మనసు కరిగిపోయింది.
అలాగే, తనింట్లో పనిమనిషి తన కూతురుకి పెళ్లి కుదిరిందని చెప్పి, రెండేళ్లయినా పెళ్లికి ఏర్పాట్లు చేయకపోయేసరికి ఒకరోజు ఆమెని పిలిచి అడిగాడు. సమయానికి డబ్బు సమకూరలేదని, ఈ లోగా అబ్బాయి వాళ్లు వేరే సంబంధం చేసుకున్నారని చెప్పి, కళ్లొత్తుకుంది. అది విని ఎంతో బాధపడ్డాడు. ఇలాంటి అనేక సంఘటనలు చూసి, అలాంటి పేదవారికి తనవంతు సాయం చెయ్యాలని నిర్ణయించుకున్నాడు. అప్పటినుంచీ ఆడపిల్లల పెళ్లిళ్లకి, పేద విద్యార్థులకు పుస్తకాలు, ఫీజుల కోసం సాయం చేయసాగాడు. అంతేగాక వినాయకచవితి ఉత్సవాలకి భారీ విరాళాలు ఇస్తూ తన తాతతండ్రుల కాలం నుంచీ వస్తున్న ఆచారాన్నీ కొనసాగిస్తూ వస్తున్నాడు.
ఆర్థిక సాయం కావాలని తరచూ ఎవరో ఒకరు తనింటికి రావడం.. వారికి సాయం చెయ్యడం నిరంతర ప్రక్రియ అయిపోయింది. దీంతో ఊళ్లో తనకు మంచిపేరు ప్రతిష్టలు, పలుకుబడి, గౌరవం పెరిగి, తనను ఒక ఉన్నత స్థానంలో కూర్చోబెట్టేశాయి. ఒకదశలో ఆ పేరు నిలబెట్టుకోవడం కోసం కావచ్చు, లేదా మంచితనంతో కావచ్చు, ఏదైతేనేం, డబ్బున్నా లేకపోయినా సేవా కార్యక్రమాలు చేయడం అలవాటు అయిపోయింది.
'మనం మధ్యతరగతి సాధారణ రైతులమండి, జమీందారుల్లాగ ఇలా అందరికీ సాయం చేస్తూ పోతే చివరికి మనకేమీ మిగలదు. కొంచెం ఆలోచించండి' అని అప్పుడప్పుడూ నెమ్మదిగా మందలిస్తుండేది అమ్మాజీ. కానీ ఆమె మాట తనెప్పుడూ పట్టించుకొనేవాడు కాదు.
'రామకృష్ణా, ఈ ఏడాదీ నీ సహకారంతోనే వినాయకచవితి ఉత్సవాలు ఘనంగా చెయ్యాలని గ్రామస్తులంతా తీర్మానించారయ్యా' అన్నాడు గ్రామపెద్ద నారాయణ.
ఈ ఏడాది వర్షాలు సరిగా లేకపోవడంతో వ్యవసాయంలో కనీసం పెట్టుబడీ రాలేదు, కానీ తప్పదు. ఊర్లో ఇప్పటిదాకా ఉన్న పేరు కాస్తా పోతుంది.
'ఓ అలాగే చేద్దాం' అన్నాడు తను బయటికి మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ.. గతేడాది లక్ష రూపాయల విరాళం ఇచ్చాడు. ఈ ఏడాదీ అలాగే చెయ్యకపోతే బాగోదు. అంతా అప్పు చేసే చెయ్యాలి. ఇప్పటికే ఉన్న చిన్న చిన్న అప్పులకీ ఇది తోడవుతుంది. 'ఏం చేస్తాం, తప్పదు' ఆలోచిస్తూ ఇంటివైపు నడుస్తున్న తనకి అక్కడికి దగ్గర్లో ఉన్న పాలకేంద్రం రోడ్డులో నుంచి వెంకట్రావు కొడుకు మోటారు సైకిల్ వెనకాల శ్రావణి సన్నిహితంగా కూర్చొని రావడం గమనించాడు. వెంకట్రావు తమ దూరపు బంధువు. తునిలో పెద్ద మోతుబరి.
శ్రావణి తమ ఒక్కగానొక్క ఆడపిల్ల. పెళ్లయ్యాక చాన్నాళ్ళకి పుట్టడంతో పిల్లలు ఇక చాలనుకున్నారు. ఒక్కతే కావడంతో అతి గారాబంగా పెరిగింది. తునిలో ఇంజినీరింగ్ ఫైనలియర్ చదువుతున్న శ్రావణి ఎప్పుడూ కాలేజీ నుంచి బస్‌లోనే వచ్చేది. కానీ ఇప్పుడిలా.. తనకి నచ్చలేదు. ఆలోచిస్తూ ఇంటికెళ్లాక, భార్యకి తను చూసిన విషయాన్ని చెప్పి, శ్రావణితో మాట్లాడమన్నాడు.
'ఇద్దరం ఒకరినొకరం ఇష్టపడుతున్నామని, ఆ అబ్బాయినే పెళ్లి చేసుకుంటా' అని అమ్మాజీతో ఖరాఖండీగా చెప్పింది శ్రావణి. చేసేది లేక వెంకట్రావుతో మాట్లాడాడు. వెంకట్రావు పెళ్లికి ఒప్పుకున్నప్పటికీ, పదిలక్షల కట్నం, పెట్టుపోతలు, పెళ్లి ఘనంగా చెయ్యాలని షరతులు పెట్టాడు. శ్రావణి ఇష్టపడిందని అన్నిటికీ ఒప్పుకొన్నాడు.
మిగిలిన ఐదెకరాల పొలం గ్రామపెద్ద నారాయణ దగ్గర తాకట్టు పెట్టి, పెళ్లి అంగరంగ వైభవంగా జరిపించాడు. పెట్టుపోతలవీ ఘనంగా పెట్టి, కూతుర్ని అత్తారింటికి సాగనంపాడు.
ఎంతోమంది పేదవాళ్ల పెళ్లిళ్లకి ఆర్థిక సహాయం చేసిన తను, పొలం తాకట్టు పెడితేనేగానీ తన కూతురి పెళ్లి చెయ్యలేని స్థితికి దిగజారిపోయాడు.
రెండు నెలలు గడిచాయి. రాత్రి భోజనాలయ్యాక గదిలో మంచం మీద కూర్చున్న తనకి మజ్జిగ గ్లాసు అందిస్తూ పక్కన కూర్చుంది అమ్మాజి.
'ఏంటి దీర్ఘంగా ఆలోచిస్తున్నారు?'
'ఏం లేదు అమ్మూ, మనం పొలం తాకట్టు పెట్టి తీసుకున్న డబ్బుకి వడ్డీ మాత్రమే చెల్లించేలా నారాయణతో ఒప్పందం. అందుచేత మన ఐదెకరాల పొలం మనమే దున్నుకోవచ్చు. దాంతో పాటు మరొక ఐదెకరాలు కూడా కౌలుకి తీసుకున్నాను.' మజ్జిగ తాగి, గ్లాసు అమ్మాజీకి అందించాడు.
'మొత్తం పదెకరాల వ్యవసాయం మీరొక్కరే ఎలా చూసుకోగలరండి? కష్టంకదా! పైగా పెట్టుబడి కూడా ఎక్కువవుతుంది. ఎక్కడి నుంచి తెస్తాం?'.
'తప్పదు అమ్మూ, ఆ భూమాత కరుణిస్తే అప్పులన్నీ తీర్చేయొచ్చు.'
పంటలు బాగా పండాలని, రాబడి బాగా వస్తే పండగలు వైభవంగా చేస్తామని ఊరి గ్రామదేవతకి మొక్కుకుంది అమ్మాజీ.
ఐదెకరాల్లో వరి, ఐదెకరాల్లో అరటితోట వేసి గతంలోలా పనివాళ్ల మీదే పూర్తిగా ఆధారపడకుండా, తనే స్వయంగా ప్రతిరోజూ ఉదయం నుంచీ సాయంత్రం వరకూ పొలం పనుల మీదే శ్రద్ధ తీసుకోసాగాడు. ఆకు ఊడుపుల దగ్గర నుంచి పిండి వెయ్యడం, కలుపు తీయించడం, తెగులు పట్టకుండా సమయానుసారంగా మందు పిచికారీ చేయడం, ఒకటేమిటి, వ్యవసాయాన్ని చంటిపిల్లలా చూసుకోసాగాడు. ఆశించినట్లుగానే వరి బాగా పండింది. అరటిగెలలు కూడా బాగా వచ్చాయి. కష్టపడిన దానికి తగ్గ ఫలితం దక్కుతున్నందుకు భార్యాభర్తల ఆనందానికి అవధులు లేవు.
మరో పదిరోజుల్లో వరి కోతకి, ఇంకో ఇరవై రోజల్లో అరటి దింపించడం కోసం ఊర్లోకి వెళ్లి కూలీలని బెత్తాయించాడు.
వారం గడిచింది. 'అల్పపీడనం కారణంగా రాబోయే రెండు రోజుల్లో ఉరుములతో కూడిన భారీవర్షాలు పడే అవకాశం వుంది, ప్రజలు అప్రమత్తంగా ఉండాలి' టీవీలో న్యూస్ రీడర్ చెప్తున్న వార్తను విని, ఒక్కసారిగా అదిరిపడ్డాడు.
చెప్పినట్టుగానే ఆ రెండోరోజు ఉదయం నుంచీ ఆకాశం అంతా కారుమబ్బులు కమ్ముకొని భారీవర్షం మొదలయ్యింది. దీనికి ఈదురు గాలులు కూడా తోడవడంతో వరి పంటంతా నీట మునిగిపోయింది, అరటితోట మొత్తం నేలకొరిగిపోయింది.
తన మొహంలో నెత్తురుచుక్క లేదు. మూడు రోజులు అన్నం ముట్టుకోలేదు. ఆందోళనతో నోటమాట రాక మంచానికి అతుక్కుపోయాడు. అమ్మాజీ మెల్లగా సముదాయించి, ధైర్యం చెప్పడంతో కోలుకున్నాడు.
వర్షం దెబ్బతో పాత అప్పులకి కొత్త అప్పులు తోడయ్యాయి. అప్పుల వాళ్ల బాధపడలేక తాముంటున్న పెంకుటిల్లు తాకట్టు పెట్టి, కొంచెం సర్దుబాటు చేశాడు. మిగిలింది పెట్టుబడికి ఉంచుకున్నాడు.
తన పరిస్థితి దిగజారిపోవడంతో అంతవరకూ తనని మాటలతో పైకెత్తేసిన వాళ్లు ఇప్పడు మొహం చాటేశారు. కొంతమందైతే తను అప్పు అడుగుతాడేమోనని భయపడి, తప్పించుకొని తిరగసాగారు.
నెల గడిచిపోయింది. మెల్లగా ధైర్యం కూడగట్టుకొని, పొలం పనులకి సమాయాత్తమయ్యాడు.
'ఏమండీ, సగం పొలం సాగుచెయ్యండి చాలు. ఈసారి నష్టమొస్తే ఇక తట్టుకోలేం, ఆలోచించండి' అంది అమ్మాజీ. నవ్వేసి ఊరుకున్నాడు రామకృష్ణ.
ఈసారి మొత్తం పదెకరాల్లోనూ కంది వేశాడు రామకృష్ణ. మందులు పిచికారీ చేయించడం, కలుపు తీయించడంలాంటి పనులన్నీ గతసారి కంటే ఇంకా ఎక్కువ శ్రద్ధతో చేయించాడు. నాలుగు నెలలు గడిచాయి. ఆశించినట్టుగానే కంది చేను విరగకాసింది. మరొక ఇరవై రోజులు గడిచాక పంట నూర్పించి, ఇంటికి చేర్చాడు. అనుకున్న దానికంటే దిగుబడి ఎక్కువ వచ్చేసరికి భార్యాభర్తలిద్దరూ ఆనందంతో ఉప్పొంగిపోయారు.
గిట్టుబాటుధర కోసం రోజూ పేపర్లో చూస్తూ, మార్కెట్ యార్డుకీ ఫోన్ చేసి, వాకబు చేయసాగాడు.
మరో వారం గడిచింది. ఉదయాన్నే పేపరు చదువుతున్న రామకృష్ణకి టీ అందిస్తూ 'ఏమండీ, ప్రభుత్వం గిట్టుబాటు ధర ఇంకా నిర్ణయించలేదు. మనకు డబ్బు అవసరమై, మనం పండించిన పంటని అమ్ముకోవాలంటే ఎలా?' అంది అమ్మాజీ.
'అప్పుడు మన పంటంతా ప్రభుత్వ మార్కెట్ యార్డులో కాకుండా బయట మార్కెట్లో షావుకార్లు నిర్ణయించిన ధరకే అమ్ముకోవాలి. ప్రభుత్వం ఆలస్యంగా ధర నిర్ణయించడం వలన డబ్బు అవసరం పడిన మనలాంటి రైతులు తక్కువ ధరకే అమ్ముకోవాల్సి వస్తుంది. ఆ తరువాత ప్రభుత్వం ఎక్కువ ధర నిర్ణయించినా ఫలితం ఉండదు. అందుకే ప్రభుత్వం ఆలోచించి, ప్రతీ పంటకీ నూర్పులు కాకమునుపే గిట్టుబాటు ధర నిర్ణయించాలి. అలాంటప్పుడే మనలాంటి చిన్న, సన్నకారు రైతులకి ఎంతో ఉపయోగం. అన్నట్టు చెప్పడం మరిచా.. ప్రభుత్వం గిట్టుబాటు ధర నిర్ణయించి, రేపు మార్కెట్ యార్డులో పెడతారట. నిన్ననే నా స్నేహితుడు నీలాద్రి ఫోన్ చేశాడు. వాడి పంట ఎల్లుండి మార్కెట్ యార్డుకి తెస్తానని చెప్పాడు. నేనూ ఎల్లుండే పట్టుకెళ్తాను.' ఖాళీ అయిన టీ కప్పు కింద పెడుతూ ఆనందంగా చెప్పాడు.
ఉదయాన్నే కందుల మూటలు మొత్తం వ్యాన్‌లోకి ఎక్కించి 'అమ్మూ, ఎదురు రా!' అన్నాడు నవ్వుతూ.
అమ్మాజీ చిరునవ్వుతో ఎదురొచ్చింది. వ్యాన్ బయలుదేరింది. మార్కెట్ యార్డ్ చేరుకున్నాక వ్యాన్ దిగి, ఆత్రంగా నోటీసుబోర్డు మీద కందుల గిట్టుబాటు ధర చూశాడు. తన కళ్లను తానే నమ్మలేకపోయాడు. వయసురీత్యా తనకు సరిగా కనిపించలేదేమోనని అనుమానంతో కళ్లు నులుముకుని మళ్లీ చూశాడు.
***
ఆలోచిస్తున్న రామకృష్ణ భుజం మీద చెయ్యి పడేసరికి ఉలిక్కిపడి, వెనక్కి తిరిగి చూశాడు.
'రామకృష్ణా! ఇక్కడేం చేస్తున్నావ్?' ఎదురుగా తన స్నేహితుడు నీలాద్రి.
'అబ్బే ఏం లేదు, ఊరికినే' నీళ్లు నమిలాడు.
'మీ వ్యాన్ డ్రైవర్ని అడిగితే నువ్వు ఏదో ఆలోచిస్తూ ఇటువైపు వచ్చావని చెప్పాడు. అవునూ ఏంటా కాగితం? ఏం రాస్తున్నావ్?'
'అదా, ఏం లేదు' కంగారుగా కాగితాన్ని మడిచి, జేబులో పెట్టేసుకున్నాడు.
'రామకృష్ణా! నాకంతా తెలుసు. ఎప్పటికప్పుడు నారాయణ నీ గురించి చెప్పేవాడు. నువ్వు చేస్తున్న సేవా కార్యక్రమాల గురించి నిన్నొకసారి మందలిస్తే, 'మంచే చేస్తున్నాను కదా, తప్పేముంది?' అంటూ తిరిగి నా మీదే కోప్పడ్డావు. అప్పటి నుంచీ ఆ విషయాలు నీతో ఎప్పుడూ మాట్లాడలేదు!' అంటూ రామకృష్ణకి తన చెయ్యి అందించి, పైకి లేపాడు నీలాద్రి.
'రామకృష్ణా! డబ్బుంటేనే ఈ రోజుల్లో మనిషికి విలువిస్తుంది ఈ సమాజం. గొప్పకోసమో, మంచితనంగానో మనమెన్ని పనులు చేసినా ఆరోజే ఆహా!.. ఓహో!.. అంటారు. ఆ మర్నాడు మళ్లీ మామూలే, అన్నీ మర్చిపోతారు. అందుకే, ఏ విషయంలోనూ అతి ఉండరాదంటారు పెద్దలు, అలాగని సాయం చెయ్యొద్దని అనడం లేదు, చెయ్యొచ్చు, మన తాహతుకి తగ్గట్టు. అంతేగానీ మానవతా దృక్పథం అంటూ చేసుకెళ్తే.. నీకు బాగా అనుభవమయ్యింది.' ఆగి రామకృష్ణ వైపు చూశాడు నీలాద్రి.
రామకృష్ణ తల దించుకొని వింటున్నాడు.
'అన్నట్టు అసలు విషయం మరిచాను. నోటీసు బోర్డు మీద నువ్వు చూసిన రేటు ఎప్పుడో పాతదట! నిన్న రాత్రి ప్రభుత్వం వారు నిర్ణయించిన గిట్టుబాటు ధర ఇప్పుడు రాశారు. ఇదిగో చూడు' అంటూ సెల్‌ఫోన్లో ఫోటో తీసిన నోటీసుబోర్డు మీద రేటు చూపించాడు.
ఆత్రంగా సెల్‌ఫోన్ అందుకొని, కొత్త రేటు చూసిన రామకృష్ణ కళ్లు ఆనందంతో మెరిశాయి. నీలాద్రిని గట్టిగా కౌగిలించుకున్నాడు.
'రామకృష్ణా! ఆర్థికంగా బాగున్నపుడు ఇష్టానుసారం ఖర్చు పెట్టేసి, లేనప్పుడు కుంగిపోయి అఘాయిత్యాలకు పాల్పడడం సరికాదు. ఒకవేళ ఇప్పుడు గిట్టుబాటు ధర తక్కువొచ్చి, మనకు నష్టమే వచ్చిందనుకో, దానికి ఆత్మహత్యే పరిష్కారమా? అప్పుల బాధలు ఎక్కువైతే ఉన్న పొలం అమ్మేస్తావు, ఆ తరువాత ఉన్న ఊళ్లోనో, పట్నంలోనో ఏదో పనిచేసుకొని బతుకుతావు. డిగ్రీ దాకా చదువుకున్నావు కదా! ఆ మాత్రం ఆలోచించకుండా నిరుత్సాహపడిపోతే ఎలా? జీవితం అన్నాక ఒడిదుడుకులు ఉంటాయి. అన్నింటికీ తట్టుకొని నిలబడగలగాలి.' రామకృష్ణ భుజం మీద చెయ్యేసి, నడుస్తూ చెప్తున్నాడు నీలాద్రి.
ఇద్దరూ మాట్లాడుకుంటూ మార్కెట్ యార్డు బయట ఉన్న కమ్మలపాక హోటల్ దగ్గరికి వచ్చాక, నీలాద్రిని ఆగమని సైగచేసి, 'ఓరు అప్పలస్వామి ! మజ్జానంకి నేను చెప్పిన రెండు భోజనాల్లోకి బొచ్చలిగురు రెడీ చెయ్యి' అన్నాడు రామకృష్ణ.
మబ్బులు వీడి ఆకాశం ప్రశాంతంగా ఉంటే పంట చేతికొచ్చిన రైతుకి ఎంతో ఆనందంగా ఉంటుంది. అలా రామకృష్ణ జీవితంలో మబ్బులు వీడడం రైతుగానే కాదు, తన జీవితంలో కష్టాలు అనే మబ్బులూ వీడాయి.
ఆడారి గణేశ్వరరావు
79899 25995