Apr 25,2021 16:50

మనసేమో బాగాలేదని చెప్పలేం
వయసేమో దాచుకోలేం..
వృద్ధాప్యఛాయలు తలవెంట్రుకల్లో
మెరిసి, శరీరాకృతిని మంచులా
కరిగిస్తూ కాలంకోసం ఎదురు చూడాల్సిందే !
ఎన్ని అనుభవాలు, ఎన్ని అనుభూతులు
కలబోసుకొని అల్లుకున్నా ఆత్మీయతలు
అనురాగాలు, అనుబంధాలు, ఆ ప్రేమలు ..
జీవితంలో మరుపురాని తీపిగుర్తులు...
చేదు గుళికలు.. మనుషులం కదా!
కొంచెం జాలి, దయ
కరుణ రసాలు ఎక్కువే మనకు..
అయినా ఓ ఆశ.. రెక్కలు తొడుక్కుని
ఒంటరిగా వదిలేసి, తమ దారి చూసుకున్న సంతానం
ఎప్పుడో ఒకప్పుడు బెంగటిల్లి ఈ చిన్ని ప్రాణాలకి
ఆసరాగా ఉంటారని..
పాతికేళ్ళు పెంచి పెద్దచేసి పిల్లల బతుకులకు
భరోసా కల్పించి, మరో తరానికి మార్గం
చూయించిన ఈ వయసుకు పెద్దరికం
కట్టబెట్టి మనుమలు మునిమనుమలకు
ఈ జీవితంలో పడ్డ కష్టాలు పాఠశాల
పాఠ్యాంశాలుగా పనికొస్తాయనే కోరిక తీరేనా!
మబ్బులు వీడిన ఆకాశం వోలే..
ఈ మిగులు జీవితం నల్గురికి
అండగా నిలబడే శక్తి ఉంటే చాలు..
ఈ ఊపిరి పీల్చే చివరి వరకు
సమాజం కోసం బతకాలని కోరుకుంటాను..
వయస్సు అడ్డేమీ కాదు
ఇంకా తపన ఉంటే సాధించుకుందాం
రేపటి తరాలకు వేగు చుక్కలం అవుదాం
వెలిగిద్దాం అణగారిన బతుకులలో ఆశా జ్యోతులను
చేయూతనిద్దాం వృద్ధాప్య శిశిరంలో రాలుతున్న
అనాధలకు చైత్రపు చిగురులమై !!
 

- రవీందర్‌ కొండ
9848408612