May 01,2022 09:37

ఆకాశంలో అల్లరి మబ్బు ఒకటి అటూ ఇటూ పరిగెడుతోంది. పున్నమి వెన్నెల వెలుగులో ఆ నల్లటి మబ్బుకు అలా ఆడుకోవడం భలే సరదాగా ఉంది. ఆ మబ్బు వెనుక ఉన్న ఒక చుక్కకి కోపం వచ్చింది. 'ఓరు! నల్లమబ్బు.. ఏంటిది? నువ్వు ఇలా పరిగెడుతూ నన్ను కనపడనీయకుండా చేస్తున్నావ్‌? పక్కకి జరుగు' అంది.
ఆ అల్లరి మబ్బు 'నేను నిన్నేమీ చేయలేదు. నా ఆట నేను ఆడుకుంటున్నాను. కావాలంటే నువ్వు నన్ను తప్పించుకుని, పక్కకి వెళ్ళు' అంది కొంటెగా.
చుక్క మబ్బు కన్నా వేగంగా కదలలేక పోయింది. మబ్బేమో కావాలని ఆ చుక్కను ఏడిపిస్తూ దానిని కప్పేస్తూ ఉంది. కాసేపటికి చుక్కకి కోపం పెరిగి 'నేను అందంగా మిణుకు మిణుకుమంటూ మెరుస్తూ ఉండటం చూసి నీకు అసూయ. అందుకే ఇలా నన్ను ఏడిపిస్తు న్నావు. ఇంకెంతసేపు ఉంటావులే నువ్వు? ఇంత నల్లగా మారాక వాన నీరులా కరిగిపోవాల్సిందేగా! మాలాగా వెలుగులు పంచుతూ మెరియడం నీ వల్ల కాదులే' అని అంది.
ఆ మాటకు మబ్బుకి బాధ కలిగింది. కానీ ఏమాత్రం బయటపడకుండా 'నేను కరిగిపోయేదాన్నే.. కానీ నా నీటితోనే ప్రపంచం అంతా బతికేది. నీలాగా పైపై మెరుపులతో కాదు. నేను కరిగిపోయి, అన్ని జీవులలో నిజమైన వెలుగులు నింపుతాను. అయినా పున్నమి చంద్రుడి వెలుగు ముందు మీ చుక్కల వెలుగెంత' అని బదులిచ్చింది మబ్బు.
వీళ్లిద్దరి పోట్లాట అప్పటివరకూ వింటున్న ఆకాశానికి విసుగొచ్చింది. 'మీరిద్ద రూ ఇంక ఆపుతారా? లేదా? మీ గొడవ ఇలాగే సాగితే అసలు మీ ఇద్దరినీ నా మీద కనపడకుండా చేస్తాను' అని మందలించింది.
దాంతో ఆ రెండూ కాసేపు నోరుమూసుకున్నాయి. అంతలోనే నల్లమబ్బు వానగా కరిగిపోయి, భూమిని చేరింది. అంతవరకు మబ్బుతో పోట్లాడిన చుక్కకు ఎందుకో బాధగా అనిపించింది.
తెల్లవారేసరికి సూర్యుడి వెలుగులో చుక్క మెరుపు కూడా కనుమరుగైపోయింది. సూర్యకిరణాల వేడికి ఆకాశం గంభీరంగా ఉండిపోయింది. సాయంకాలం కాగానే ఆ చుక్క మళ్ళీ మెరువసాగింది. కానీ సంతోషంగా లేదు. దిగాలుగా దిక్కులు చూస్తూ అక్కడే కదులుతోంది. ఉదయం నుంచి చుక్కనే గమనిస్తున్న ఆకాశం అడిగింది 'చుక్కమ్మా.. ఎందుకలా దిగాలుగా ఉన్నావు? ఈరోజు నీకెవరూ అడ్డులేరుగా.. హాయిగా ఆడుకో' అంది.
చుక్క తలవంచుకుని ఆకాశంతో 'అత్తా! నిన్న నల్లమబ్బు ఉన్న కాసేపు దానితో దోబూచులాడుకోకుండా అనవసరంగా గొడవపడ్డాను. కనీసం తనని క్షమించమని అడగడానికీ అవకాశం లేకుండాపోయింది' అని చెప్పింది బాధగా.
'తప్పులు చేయటం సహజమే. కానీ తప్పును తెలుసుకుని ఒప్పుకోవడం చాలా గొప్ప విషయం. నువ్వు చాలా గొప్పదానివి. అన్నివేళలా తప్పును సరిదిద్దుకునే అవకాశం రాదు. అందుకే బాగా ఆలోచించి మాట్లాడాలి. ఇతరులను హేళన చేస్తే పొందే ఆనందం కొద్దిసేపే ఉంటుంది. కానీ తప్పు చేశానన్న బాధ ఎప్పటికీ మనలను బాధపెడుతుంది. ఇకపై అలా చేయకు' అని చుక్కను ఓదార్చింది ఆకాశం.
చుక్క బుద్ధిగా ఆకాశం మాటలు విని, తలాడిస్తున్న సమయంలోనే ఒక తుంటరి తెల్లమబ్బు చుక్కకు అడ్డుగా వచ్చి ఆగింది. అప్పటివరకు బాధగా ఉన్న చుక్క నవ్వుతూ మబ్బుని పలుకరించింది. ఆ తెల్లమబ్బు 'అబ్బో నీకు కోపం రాలేదే ఇవాళ? నన్ను గుర్తుపట్టలేదా? నిన్న నీతో గొడవపడిన నల్లమబ్బుని' అంది.
'నాకు నువ్వని తెలుసు. కనుకనే పలుకరించా. నిన్న జరిగినదానికి క్షమించు. నాతో స్నేహం చేస్తావా?' అని అడిగింది చుక్క.
'నేనూ నిన్ను గేలి చేశాను. తప్పు నాదీ ఉంది. నన్నూ క్షమించు' అంటూ చుక్కను హత్తుకుంది మబ్బు.
పక్కన ఇంకో నల్లమబ్బు వచ్చి 'మీరిద్దరూ పక్కకి జరిగి ఆడుకోండి. నేను మా నల్లమబ్బులతో పాటు అక్కడకి వెళ్ళి, వాన కురవాలి' అంటూ వాటిని కప్పేసింది. నల్లమబ్బు వెళ్లిపోయేవరకూ అలాగే హత్తుకుని ఉన్న అవి రెండూ ఎప్పటికీ స్నేహితులుగానే ఉన్నాయి.
- డాక్టర్‌ హారికా చెరుకుపల్లి
9000559913