Jun 13,2021 12:27

దేశం ధగధగా వెలిగిపోతోందని
అతడంటున్నాడు,
అది ఆరని చితి మంటల వెలుగని....
వేల కోట్ల విగ్రహపు శిఖరాగ్రం నుండి స్పష్టంగా
కనిపిస్తుందని అతడికి,
''నువ్వూ చెప్పకు, నేనూ చెప్పను''

ఏపుగా పెరిగిన గడ్డంలో అతడు రాజ్యాభివృద్ధిని చూస్తున్నాడు,
ఒకానొక బీద దేశపు దయను మనమిప్పుడే అందుకున్నామని....అతడికి
''నువ్వూ చెప్పకు, నేనూ చెప్పను...''

అతడప్పుడప్పుడూ....
కొన్ని కాలక్షేపపు కబుర్లు చెప్తూ,
నిజం కాని ఓ నాలుగు కన్నీళ్లను నీమీదేస్తుంటాడు,
''వంద ఎలుకలు తిన్న పిల్లి తీర్థయాత్రకు వెళ్లింది''
ఈ సామెత అతడికి గుర్తుచేయకు....

మనమెప్పటిలాగే మౌనంగా ఉందాం...
శునకాలు పీక్కు తినే శవాలను చూస్తూ,
పుణ్యనదిలో పారుతున్న దేహాలను చూస్తూ,
అందని ఊపిరితో అలమటిస్తున్న అభాగ్యులను చూస్తూ,
విస్టాలను, విగ్రహాలను, విజయాలుగా కీర్తిస్తూ....

అదిగో....
అతడు దూరంగా నా సమాధి కోసం గొయ్యిని తవ్వుతున్నాడు....
నేనేం మాట్లాడట్లేదు, నువ్వేం మాట్లాడకు,
రేపు పేర్చబోయే నీ చితికోసం ఎదురుచూస్తూ ఉండు ఇలాగే....ఎప్పటిలాగే....
 

- జాబేర్‌ పాషా
మస్కట్‌ (ఒమన్‌)
00968 97663604