Oct 17,2021 12:08

అక్కడ మరణం
నిత్యకృత్యం
అక్కడ నరరూప తోడేళ్లు
ప్రాణాల్ని నిముషాల్లో
తోడేస్తాయి

మానవహక్కులు
సమాధి చేయబడతాయి
అక్కడ మనుషులు
జీవచ్ఛవాలు

విమానాల రెక్కలు
పట్టుకొని గాల్లో తేలుతూ
నేలమీద మాంసం ముద్దలుగా
రాలిపోయిన అభాగ్యులు

అక్కడ
జన్మనిచ్చిన
స్త్రీమూర్తులపై
నిషేధాజ్ఞలు

పసిపిల్లల
ఆకలిని తీర్చలేని
తల్లుల మౌనరోదన

తుపాకుల మధ్య
వికటాట్టహాసాల మధ్య
అధికార మత్తేభ ఘీంకారాల మధ్య
మానవత్వం మచ్చుకైనా
కానరాని కర్కశ శాసనాల మధ్య
నిజమైన పొద్దు పొడుపు కోసం
నిరీక్షించే అభాగ్యుల కళ్లల్లో

స్వేచ్ఛాజ్యోతులు
వెలిగేదెప్పుడో
నవజీవన వసంతాలు
విరబూసేదెన్నడో
 

మంకు శ్రీను
89859 90215