'డాన్స్ ఈజ్ ద హిడెన్ లాంగ్వేజ్ ఆఫ్ ది సోల్...' అంటారు ప్రముఖ అమెరికన్ నృత్యకళాకారిణి మార్తా గ్రాహం. నృత్యం ఆత్మ యొక్క రహస్య భాష. దీనికి సంజ్ఞ కంటే ఎక్కువ శక్తి, పదం కంటే ఎక్కువ వాగ్ధాటి, రాత కంటే ఎక్కువ గొప్పతనం వుంది. కాబట్టి, నృత్యం స్వయంసమృద్ధిగల భాష. ఆనందం, ప్రేమ, విచారం, శాశ్వత భావోద్వేగాలు లేకుండా నృత్యం వుండదు. లక్షలాది మందిని ఏకం చేసే ఒక కళారూపం. విశ్వ మానవ వికాసానికి దోహదపడే జీవనాదం. మానవజాతి ఆవిష్కరించుకున్న అనేక కళల్లో నృత్యం ప్రాచీనమైనది. ఆంగికం, వాచికం, ఆహార్యం, సాత్వికం- అను నాలుగు ఉపాంగాలు ఈ నాట్యానికి ప్రాణం. 64 భారతీయ కళలలో నృత్యం ఒకటి. శ్రమలో భాగంగా కాళ్లూ చేతుల కదలిక నుంచి నాట్యం ఆవిర్భవించిందని అంటారు. సంగీతానికి పారవశ్యమై... శరీరంలో ఏర్పడే కదలికలే నృత్యం. లయబద్ధ సంగీతానికి... శరీరం లయబద్ధంగా కదలడం అని చెప్పవచ్చు. మంచి సంగీతం వినిపించినప్పుడు తెలియకుండానే కాళ్లు, చేతులు ఆడిస్తాం. ప్రతి ఒక్కరూ ఏదో ఒక సందర్భంలో కాలు కదిపినవారే... చేయి తిప్పినవారే... శరీరాన్ని కదిలించినవారే. ప్రజలకు జీవితంలో ఎదురయ్యే బాధలు, భారాల నుండి నృత్యం ఉపశమనం కలిగించగలదు. భారతీయ నృత్య రీతులతోపాటు జానపద కళారూపాలూ ప్రాచీనతను, ప్రాచుర్యాన్ని కలిగినవే! నిజానికి జానపదాలను జ్ఞానపథాలని సగర్వంగా చెప్పవచ్చు.
'లోక వృత్తానుకరణం నాట్యం' అని భరతముని అన్నట్లుగా నాట్యశాస్త్రం చెబుతోంది. సమకాలీన సమస్యలను ఇతివృత్తాలుగా తీసుకొని, ప్రజలను మేల్కొలిపేదిగా నాట్యం ఉండాలనేది దీని సారాంశం. అలా జనించినదే ఆంధ్రప్రదేశ్ సంప్రదాయ నృత్యం కూచిపూడి. ఆకట్టుకునే భావవ్యక్తీకరణ, ఆకర్షణీయమైన చూపులు, భావోద్వేగాల సమ్మేళనం దీని సొంతం. అలాగే భావం, రాగం, తాళాలను అద్భుతంగా వ్యక్తీకరిస్తుంది తమిళనాడు శాస్త్రీయ నృత్య విధానమైన భరతనాట్యం. వీటితోపాటు ఒడిస్సీ, మణిపురి, మోహినీ ఆట్టం, సత్తియ నృత్యం, కథాకళి, కథక్ వంటివి జనరంజకమైన భారతీయ నృత్యరీతులు. ఆయా రాష్ట్రాలు, ప్రాంతాల సంస్కృతి సంప్రదాయాలకు ప్రతిబింబాలు. మన దేశ సాంస్కృతిక వైవిధ్యంలో ఇది విడదీయరాని అంశం.
నృత్యాన్ని కళగానే కాకుండా మానసిక ఉల్లాసాన్ని, శారీరక సామర్థ్యాన్ని, ఆలోచనా శక్తిని పెంచే సాధనంగానూ ప్రాచుర్యం పొందుతోంది. నగరాల్లో వెలసిన ఫిట్‌నెస్ సెంటర్లలోనూ రకరకాల నృత్యరీతులు ప్రవేశించాయి. సంప్రదాయ నృత్యాలతో పాటు సల్సా వంటి పాశ్చాత్య నృత్యాల పట్ల కూడా ఆసక్తి చూపుతున్నారు. కూచిపూడి, కథక్, భరతనాట్యం వంటి భారతీయ సంప్రదాయ నృత్యాలకు విదేశాల్లోనూ మంచి ఆదరణ ఉంది. విదేశీయులు సైతం మన సంప్రదాయ నృత్యం నేర్చుకుంటున్నారు. అందుకే నాట్యం సర్వకళల సమాహారం. సాధారణ వ్యాయామాలతో పోలిస్తే... నృత్య సాధన వల్ల మెదడు లోని 'హిప్పోక్యాంపస్' ప్రాంతం వృద్ధి చెందడం ద్వారా ముసలితనాన్ని పారదోలుతుందని జర్మనీకి చెందిన 'న్యూరో డీ జనరేటివ్ డిసీజ్' కేంద్ర పరిశోధకులు చెబుతున్నారు. 'అందము/ దేహమానసములందు దృఢత్వము నిండ/ సత్కళానందము పొందనిండు/ పరిణామము చూడుడు' అని ఓ కవి చెప్పినట్లుగా నృత్యం నిత్య యవ్వన ప్రదాయిని. నృత్యం అద్భుతమైన వ్యాయామం.
'శ్రమైక జీవన సౌందర్యానికి/ సమానమైనది లేనే లేదని' మహాకవి శ్రీశ్రీ చెబుతాడు. ఆరుగాలం కష్టించి, శ్రమించే కార్మికులు, కర్షకులు, శ్రమజీవుల శ్రమ నుంచే ఆట, పాట పుట్టాయి. అలసిన శరీరాలకు ఈ ఆటా పాట స్వాంతన కలిగిస్తాయి. ఈ ఆట, పాట జనంలో నుంచి పుట్టింది కనుకే జానపదం అన్నారు. జానపద నృత్యం విషయానికొస్తే కోలాటం, డప్పు నృత్యం, ఒగ్గుడోలు, చిడతల రామాయణం, బతుకమ్మ నృత్యం, బోనాల నృత్యం వంటి ప్రక్రియలన్నీ జనం నుంచి జనించినవే. ఆదరణ కోల్పోయి... అంతరించిపోతున్న జానపద కళారూపాలను, నృత్యరీతులను కాపాడుకుంటూ... భవిష్యత్తరాలకూ అందించాల్సిన అవసరం ఎంతైనా వుంది.










