Nov 13,2023 22:23

ప్రజాశక్తి-కాకినాడ ప్రతినిధి పట్టణ ప్రాంత పేదల సొంతింటి కల ఇంకా నెరవేరడం లేదు. గత టిడిపి ప్రభుత్వ హయాంలో నిర్మించిన టిడ్కో గృహాలు వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నాలుగున్నరేళ్లు దాటుతున్నా నేటికీ పూర్తిస్థాయిలో ఇవ్వలేకపోతుంది. అదిగో ఇదిగో అంటూనే మౌలిక సదుపాయాలను కల్పించడంలో తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తోంది. లబ్ధిదారులు ఎక్కడిక్కడ గగ్గోలు పెడుతుంటే కంటి తుడుపు చర్యగా గృహాలను ఆర్భాటంగా ప్రారంభించారు. కనీస సౌకర్యాలు కరువవ్వడంతో ప్రవేశాలు చేయడానికి పేదలు వెనుకడుగు వేస్తున్నారు. రూ.లక్ష, రూ.50 వేలు చెల్లించి ఏళ్లు గడుస్తున్నా, వాటికి వడ్డీలు కట్టలేక ఇబ్బందులు పడుతున్నా, అద్దె ఇళ్లల్లో ఉంటూ అప్పుల పాలవుతున్నా పట్టించుకోని ప్రభుత్వ తీరుపై తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరో మూడు నెలల్లో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో సౌకర్యాలు కల్పించి టిడ్కో ఇళ్ళను అప్పగిస్తారా లేదా అనేది లబ్ధిదారుల్లో అయోమయం నెలకొంది.
కాకినాడ జిల్లాలో రెండు విడతల్లో పెద్దా పురంలో 3,312 ప్లాట్లకు 1,728, సామర్లకోట జగ్గం వారిపేటలో 416, ఉప్పువారి సత్రం వద్ద మొత్తంగా 1,054 ప్లాట్లను, పిఠాపురంలో 864 ప్లాట్లకు 864 ప్లాట్లను, కాకినాడ సైట్‌ ఎలో 1,152, సైట్‌ బిలో 904 మొత్తంగా 2,056 ప్లాట్లు మంజూరు కాగా తొలి విడతలో 1,152 ప్లాట్లను పంపిణీ చేశారు. మొత్తంగా 4,800 మందికి ఇళ్ళు అప్పగించామని అధికారులు చెబుతున్నా 10 శాతం మంది కూడా ప్లాట్లలో నివాసం ఉండడం లేదు.
మౌలిక వసతులు కరువు
గత టిడిపి, ప్రస్తుత వైసిపి ప్రభుత్వాలు రాష్ట్ర టిడ్కో ఇళ్లకు రంగులు వేయడంపై ఉన్న శ్రద్ధ కాలనీల్లో మౌలిక వసతుల కల్పనపై లేదని ప్రజా రక్షణ భేరి రాష్ట్ర బస్సు యాత్ర సందర్భంగా సిపిఎం నేతలు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. సామర్లకోటలో ఉన్న టిడ్కో ఇళ్లను ఇటీవల వారు పరిశీలించారు. సామర్లకోటలో గృహాల్లో మౌలిక వసతులు లేవని, ప్రజలకు నివాసయోగ్యంగా లేవని, ఏలేరు కాల్వకు వరద వస్తే ముంపునకు గురయ్యే ప్రమాదం ఉందన్నారు. కాలనీల్లో అవసరమైన తాగునీరు, విద్యుత్తు, డ్రైన్లు వంటి సదుపాయాలపై ఏళ్ల తరబడి దృష్టి పెట్టలేదని ఆవేదన వ్యక్తం చేసారు. పిఠాపురంలో కొన్ని ప్లాట్లను అప్పగించినా నేటికీ మౌలిక సదుపాయాలను కల్పించలేకపోయారు. కేవలం ఇద్దరు మాత్రమే గత్యంతరం లేని పరిస్థితుల్లో నివాసం ఉంటున్నారు. మూడేళ్లుగా వాటర్‌ ట్యాంక్‌ నిర్మాణం జరుగుతూనే ఉంది. పనులు ముందుకు సాగడం లేదు. డ్రైనేజీలు అస్తవ్యస్తంగా ఉన్నాయి. విద్యుత్తు లైన్ల పనులు నత్తనడకన జరుగుతున్నాయి. పెద్దాపురంలో శానిటేషన్‌ సమస్యతో అనేకమంది లబ్ధిదారులు ప్లాట్లలోకి వెళ్లలేదు. ఉన్నవారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాగునీటి సమస్య ఎక్కువగా ఉంది. దోమలు దండయాత్ర చేస్తున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాకినాడలో ప్లాట్లు అప్పగించినా ఎవరూ నివాసం ఉండడం లేదు. కొన్ని ప్లాట్లలో స్లాబు నుంచి వర్షం నీరు లీకఅవుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని లబ్ధిదారులకు విమర్శిస్తున్నారు.