ప్రజాశక్తి -ఆనందపురం : నిధులు లేక గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించలేకపోతున్నామని మండల సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు ముందు సర్పంచులు ఆవేదన వ్యక్తంచేశారు. ఆనందపురం మండల పరిషత్ కార్యాలయంలో ఎంపిపి మజ్జి శారదా ప్రియాంక ఆధ్వర్యాన మంగళవారం మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. మామిడిలోవ ఎస్‌సి, బిసి కాలనీలకు తాగునీటి కుళాయిలు ఏర్పాటుచేయలేకపోయామని, ఎన్నిసార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పరిష్కారానికి నోచుకోలేదని, దబ్బందలో ల్యాండ్ పూలింగ్ రైతులకు పట్టాలు, పరిహారం ఇవ్వలేదని మామిడిలోవ సర్పంచ్ బలిరెడ్డి మల్లికార్జునరావు ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. ఆనందపురం పంచాయతీ పొడుగుపాలెం దొంతలవారి కల్లాలలో జల జీవన మిషన్ ద్వారా మంచినీటి కుళాయిలు ఏర్పాటుకు శంకుస్థాపన చేసినా నేటికీ పనులు పూర్తి కాలేదని సర్పంచ్ చందక లక్ష్మి సభ దృష్టికి తీసుకొచ్చారు. నాలుగేళ్ల క్రితం దొంతలవారి కల్లాలు రోడ్డు ప్రారంభించి మధ్యలోనే వదిలేసారని, దీంతో గుంతలు ఏర్పడి గ్రామస్తులు ఇబ్బందులు పడుతున్నారని సభలో లేవనెత్తారు. తర్లువాడ గ్రామంలో మంచినీటి సమస్యపై సర్పంచ్ బిఆర్‌బి.నాయుడు, పందలపాక పంచాయతీ గంటాపేటలో వాటర్ ట్యాంక్ నిర్మాణం చేపట్టాలని ఎంపిటిసి విజనగిరి అప్పలనాయుడు, ఆనందపురం జంక్షన్ నుంచి బిపి కల్లాలకు వెళ్లే రోడ్డుకు నిధులు కేటాయించాలని సర్పంచ్ కోన పైడిరాజుశ్రీను, ముచ్చర్ల గ్రామంలో 60 స్తంభాలకు వీధి లైట్లు లేవని, నిధులు మంజూరుచేయాలని, గ్రామానికి ఆర్‌టిసి బస్సు సౌకర్యం కల్పించాలని ఆ గ్రామ సర్పంచ్ షినగం ఎర్రయ్య, చందక గ్రామపంచాయతీలో లో-వోల్టేజ్ సమస్య ఉందని, ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటుచేయాలని ఆ బంక శ్రీను సభలో ప్రస్తావించారు.










