
* ఆర్‌జియుకెటి ఛాన్సలర్ కె.సి రెడ్డి
ప్రజాశక్తి - ఎచ్చెర్ల: మౌలిక వసతుల కల్పనపై దృష్టిసారించాలని రాజీవ్‌గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం (ఆర్‌జియుకెటి) ఛాన్సలర్ కె.సి రెడ్డి అధికారులకు సూచించారు. స్థానిక ట్రిపుల్ ఐటిలో రూ.3.60 కోట్ల వ్యయంతో చేపడుతున్న పలు పనులను గురువారం పరిశీలించారు. విద్యార్థులకు వసతి సదుపాయాల నిమిత్తం ఎచెర్లలో కొత్తగా నిర్మిస్తున్న వసతి భవనాల పనులను పరిశీలించారు. పనుల నాణ్యతలో ఎక్కడా రాజీ పడొద్దన్నారు. ల్యాబ్ భవనం పనులను పరిశీలించి అత్యాధునికంగా, త్వరగా నిర్మాణ పనులు చేయాలన్నారు. 250 కెవి జనరేటర్‌ను ప్రారంభించారు. రూ.2.62 కోట్ల వ్యయంతో నూతనంగా చేపడుతున్న అదనపు వసతి భవన పనులను పరిశీలించి చేపడుతున్న పనుల పురోగతిపై సంతృప్తి వ్యక్తం చేశారు. పర్యటనలో ట్రిపుల్ ఐటి డైరెక్టర్ పెద్దాడ జగదీశ్వరరావు, ఒఎస్‌డి ఎల్.డి సుధాకర్‌బాబు, పరిపాలన అధికారి ముని రామకృష్ణ, డీన్ మోహన్‌కృష్ణ చౌదరి, ఫైనాన్స్ ఆఫీసర్ అసిరినాయుడు, వెల్ఫేర్ డీన్ గేదెల రవి, ఇఇ తమ్మిరెడ్డి, డిఇ వెంకటరెడ్డి, డిప్యూటీ ఎఒ రఘుపతిరావు తదితరులు పాల్గొన్నారు.