Sep 04,2023 23:08

శంకుస్థాపన చేస్తున్న స్పీకర్‌ సీతారాం

* స్పీకర్‌ తమ్మినేని సీతారాం
ప్రజాశక్తి- ఆమదాలవలస: 
గ్రామాల్లో కనీస మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తున్నట్లు శాసన స్పీకర్‌ తమ్మినేని సీతారాం పేర్కొన్నారు. సోమవారం మండలంలోని కలివరం పంచాయతీ పరిధిలోని పీర్‌ సాహెబ్‌ పేట, ముద్దాడ పేట గ్రామాలలో 62 లక్షల రూపాయలతో జలజీవన్‌ మిషన్‌ ద్వారా ఇంటింటికీ మంచినీటి కుళాయిల పంపిణీ కార్యక్రమానికి శంకుస్థాపన చేశారు. అనంతరం 68.71 లక్షల రూపాయల నిధులతో తమ్మయ్యపేట గ్రామం 61.75 లక్షల రూపాయలు నిధులతో కలివరం గ్రామంలో ఇంటింటికి మంచినీటి పంపిణీ కార్యక్రమానికి ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గ పరిధిలో జల జీవన్‌ మిషన్‌ ద్వారా యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తున్నట్లు తెలిపారు. గడపగడపకు మన ప్రభుత్వం పూర్తి చేసిన గ్రామాలకు కనీస వసతుల కల్పనకు 20 లక్షల రూపాయల చొప్పున కేటాయించామని అన్నారు. ఆ గ్రామ పరిధిలో చేపట్టిన పనులకు నిధులను వినియోగించి త్వరిత గతిన పనులను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ప్రతినిధి తమ్మినేని శ్రీరామ్మూర్తి, పిఎసిఎస్‌ అధ్యక్షులు గురుగుబెల్లి శ్రీనివాసరావు, మండల సచివాలయాల కోఆర్డినేటర్‌ బొడ్డేపల్లి నిరంజన్‌ బాబు, సర్పంచ్‌ టొంపల ఉమ, అధికారులు పాల్గొన్నారు.