Nov 02,2023 20:39

సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ గిరీష

రాయచోటి : జిల్లాలోని జగనన్న లే అవుట్‌ కాలనీలలో ఇప్పటికే గుర్తించిన మౌలిక వసతుల సమస్యలను పది రోజుల్లోగా వేగంగా పరిష్కరించాలని కలెక్టర్‌ గిరీష గహ నిర్మాణ, అనుబంధ శాఖల అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో పట్టణ, గ్రామీణ ప్రాంతాలలోని జగనన్న లేఅవుట్‌ కాలనీలలో మౌలిక వసతుల కల్పనకు తీసుకున్న చర్యలపై హౌసింగ్‌, పబ్లిక్‌ హెల్త్‌, ఆర్‌డబ్ల్యుఎస్‌, ఎపి ఎస్‌పిడిసిఎల్‌ అధికారులతో కలెక్టర్‌ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలో మొత్తం ఎన్ని జగనన్న లేఅవుట్‌ కాలనీలో ఉన్నాయి, నియోజకవర్గాల వారీగా ఎన్ని కాలనీలలో మౌలిక వసతుల సమస్యలను గుర్తించారని హౌసింగ్‌ అధికారులను కలెక్టర్‌ ప్రశ్నించారు. జిల్లాలో మొత్తం పట్టణ గ్రామీణ ప్రాంతాలలో 512 జగనన్న లేఅవుట్‌ కాలనీలున్నాయని, అందులో 258 కాలనీలలో నీటి వసతికి పైప్‌ లైన్‌ ఏర్పాట్లు, ఇంటింటికి కుళాయి, విద్యుత్‌ సౌకర్యంలో భాగంగా షిఫ్టింగ్‌ ఆఫ్‌ పోల్స్‌, మీటర్ల ఏర్పాటు అంశాలలో సమస్యలను గుర్తించినట్టు హౌసింగ్‌ అధికారులు వివరించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ ఆయా కాలనీలలో గుర్తించిన సమస్యలను ఎట్టి పరిస్థితులలో పది రోజుల్లోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రతి కాలనీలో తప్పనిసరిగా చిన్న తరహా నీటి ట్యాంకులు, పైప్‌ లైన్లు ఏర్పాటు చేసి పూర్తయిన ప్రతి ఇంటికీ కుళాయి కనెక్షన్‌ తప్పనిసరిగా ఇవ్వాలన్నారు. పులపత్తూరులో జిఎల్‌ఎస్‌ఆర్‌ నీటి ట్యాంకును ఏర్పాటు చేయాలని ఆర్డబ్ల్యూఎస్‌ అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా 10 జగనన్న లేఅవుట్‌ కాలనీలలో నూతనంగా అనుమతులు అవసరమని ఆర్‌డబ్ల్యుఎస్‌ ఎస్‌ఇ కలెక్టర్‌ దష్టికి తీసుకురాగా వెంటనే అనుమతులు మంజూరు చేస్తున్నట్టు కలెక్టర్‌ పేర్కొన్నారు. సమావేశంలో ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.