Oct 11,2023 21:27

జెజెఎం కుళాయిని పరిశీలిస్తున్న నాబార్డు జిఎం జయకన్నన్‌

ప్రజాశక్తి-విజయనగరం : జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో వైద్యం, విద్య, తాగునీటి సరఫరాకు సంబంధించి మౌలిక వసతులు కల్పించే ప్రాజెక్టులకు నాబార్డు పెద్ద ఎత్తున ఆర్థిక సహాయం అందిస్తున్నట్టు జనరల్‌ మేనేజర్‌ పి.జయకన్నన్‌ వెల్లడించారు. నగరంలోని గాజులరేగలో ప్రభుత్వ వైద్య కళాశాలను బుధవారం ఆయన పరిశీలించారు. ప్రిన్సిపల్‌ ఛాంబరులో వైద్య మౌలిక వసతుల సంస్థ అధికారులతో విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో నాబార్డు ఆర్థిక సహాయంతో చేపడుతున్న ఆస్పత్రుల, వైద్య కళాశాలల నిర్మాణ పనులపై సమీక్షించారు. ప్రస్తుత స్థితిగతులను తెలుసుకున్నారు. పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రికి రూ.49 కోట్లు ఇస్తున్నారని, ప్రస్తుతం పునాదుల స్థాయిలో నిర్మాణం ఉందని వైద్య మౌలిక వసతుల సంస్థ ఎస్‌ఇ శివకుమార్‌ వివరించారు. భద్రగిరి, సాలూరు, కురుపాంలో ఆస్పత్రుల నిర్మాణాలు వచ్చే రెండు మూడు నెలల్లో పూర్తి చేస్తామని ఎస్‌ఇ తెలిపారు. విజయనగరం జిల్లాలో ఎస్‌.కోట, గజపతినగరం ఆస్పత్రుల నిర్మాణ పనులు వచ్చే ఏడాది ఫిబ్రవరికి పూర్తిచేస్తామని చెప్పారు. నెల్లిమర్లలో వచ్చే నెలకు, బాడంగిలో డిసెంబరుకల్లా ఆస్పత్రుల నిర్మాణ పనులు పూర్తవుతాయని వివరించారు.
నాబార్డు సహాయంతో చేపట్టే పనులకు నిధుల విడుదల సమస్య లేదని, క్లెయిమ్‌ చేసిన మరుసటి రోజే విడుదల చేస్తామని జిఎం కన్నన్‌ చెప్పారు. అనంతరం వైద్య కళాశాల మొదటి సంవత్సరం విద్యార్థులతో నాబార్డు జిఎం ముచ్చటించారు.
అనంతరం మీడియాతో ఆయన మాట్లాడుతూ వైద్య కళాశాల ఏర్పాటుకోసం నాబార్డు ద్వారా రూ.405 కోట్లు అందజేస్తున్నట్టు చెప్పారు. డిసెంబరు 2024 నాటికి ఇక్కడి వైద్యకళాశాల నిర్మాణం పూర్తి కావలసి ఉందని, ఇప్పటికే 60 శాతం వరకు పనులు పూర్తయ్యాయని చెప్పారు. జిల్లాలో 121 అంగన్‌వాడీ భవనాలు, 123 పాఠశాల భవనాల నిర్మాణానికి కూడా నాబార్డు ఆర్థిక సహాయం అందజేస్తున్నట్టు తెలిపారు. జల్‌జీవన్‌ మిషన్‌ కింద గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సరఫరా పనుల కోసం రూ.177 కోట్లు అందిస్తున్నామని వివరించారు. జిల్లాలో 97 వేల మెట్రిక్‌ టన్నుల సామర్థ్యం కలిగిన గిడ్డంగులను నిర్మించేందుకు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ద్వారా ఆర్థిక సహాయం అందించామని వెల్లడించారు. పర్యటనలో నాబార్డు కన్సల్టెంట్‌ తోట ప్రభాకరరావు, జిల్లా మేనేజర్‌ నాగార్జున, ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపల్‌ కె.పద్మలీల, వైద్య మౌలిక వసతుల సంస్థ ఇఇ ప్రసాద్‌, డిఇ శివకుమార్‌ తదితరులు పాల్గొన్నారు.
జెజెఎం అమల్లో జిల్లా భేష్‌
చీపురుపల్లి మండలం రామలింగాపురం, పురయ్యవలస గ్రామాలను నాబార్డు బృందం సందర్శించింది. జల్‌జీవన్‌ మిషన్‌ కార్యక్రమంలో ఇంటింటికీ ఇచ్చిన కుళాయి కనెక్షన్లు, తాగునీరు సరఫరా, నాణ్యతను పరిశీలించి, సంతృప్తి వ్యక్తం చేసింది. ఈ కార్యక్రమంలో నాబార్డు జిఎం జయకన్నన్‌ వారు మాట్లాడుతూ జల్‌ జీవన్‌ మిషన్‌ ద్వారా ఇంటింటికీ అందే నీరు నిరంతరం కొనసాగాలంటే ప్రజల భాగస్వామ్యం చాలా అవసరమని తెలిపారు. కార్యక్రమంలో ఆర్‌డబ్ల్యుఎస్‌ ఎస్‌ఇ బి.ఉమాశంకర్‌, ఇఇ ఎ.వి.ఎస్‌.రాజన్‌, చీపురుపల్లి డిఇఇ వై.గోవింద రావు పాల్గొన్నారు.