Oct 18,2022 23:34

ఉపాధ్యాయులతో యుటిఎఫ్‌ నేతలు

ప్రజాశక్తి -అరకులోయ రూరల్‌:యుటీఎఫ్‌ జీపు జాతాలో భాగంగా మంగళవారం రెండో రోజు అరకులోయ, డుంబ్రిగుడ, హుకుంపేట మండలాల్లోని గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో సందర్శించారు. పాఠశాలలో ఉపాధ్యాయులు, నెలకొన్న సమస్యలు యుటిఎఫ్‌ నేతలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా యూటిఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి మహేష్‌ మాట్లాడుతూ, ఈ సమస్యల పరిష్కారం కోసం ఈనెల 30న పాడేరులో రాష్ట్ర స్థాయి సదస్సు ఏర్పాటు చేయటం జరుగతుందని, ఈ కార్యక్రమానికి రాష్ట్ర గిరిజన సంక్షేమ మంత్రి రాజన్నదొర హాజరవుతారని తెలిపారు. మేధావులు, ఉపాధ్యాయులు జీపు జాతా ను జయప్రదం చేయాలని కోరారు. గిరిజన ప్రాంతంలో 100శాతం ఉద్యోగ అవకాశం కల్పిస్తున్న జీవో 3ను పునరుద్ధరణ చేసి, గిరిజన ప్రాంతంలో ఖాళీగా ఉన్న బ్యాక్‌లాగ్‌ పోస్టులు, గిరిజన స్పెషల్‌ డిఎస్సి భర్తీ చేసి గిరిజన నిరుద్యోగులకు ఉద్యోగాలు అవకాశాలు కల్పించాలన్నారు. గిరిజన ప్రాంతాలో ఉన్న మండలాల్లో ఖాళీగా ఉన్న ఎంఇఓ పోస్టులను ట్రైబల్‌ వెల్ఫేర్‌ టీచర్లతో భర్తీ చేయాలని తెలిపారు. గిరిజన ప్రాంతాలో పాఠశాలల్లో పని చేస్తున్న సిఆర్టీలను రెగ్యులరైజ్‌ చేసి సెలవులు మంజూరు చేయాలన్నారు. మాతృభాషా వాలంటీర్లను రెన్యువల్‌ చేసి, బకాయి వేతనాలు చెల్లించాలన్నారు. ఏజెన్సీలో ఆశ్రమ పాఠశాలలు, కళాశాలల వసతి గృహాల్లో ఏఎన్‌ఎంలను నియమించాలని పేర్కొన్నారు. గిరిజన విద్యార్థులకు పౌష్టిక ఆహారం అందించేందుకు మెనూ ఛార్జీలు పెంచాలని డిమాండ్‌ చేశారు. పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా భవనాలు, మరుగుదొడ్లు, డైనింగ్‌ హాల్స్‌, తరగతి గదులు, పూర్తి స్థాయిలో మౌలిక వసతులు కల్పించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో యుటిఎఫ్‌ జిల్లా కార్యదర్శి కె రఘునాథ్‌, ఎస్‌.రాంబాబు, ఎం.బాబురావు, పి దేముడు, తదితరులు పాల్గొన్నారు.