ప్రజాశక్తి పాడేరు:ఏజెన్సీలో రహదారులు, తాగునీటి సమస్యలు, విద్యా సంస్థలకు మౌలిక సదుపాయాలు కల్పనకు అధిక ప్రాధాన్యత ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. ఎస్. జవహర్ రెడ్డి స్పష్టం చేసారు. అల్లూరి సీతారామ రాజు జిల్లా, పార్వతీపురం మన్యం జిల్లా అధికారులతో కలెక్టరేట్ సమావేశ మందిరంలో శనివారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మాతా శిశు మరణాల నివారణకు పటిష్టమైన చర్యలు చేపట్టాలని చెప్పారు.
అల్లూరి సీతా రామరాజు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ మాట్లాడుతూ, రీ సర్వే, అటవీ హక్కుపత్రాలు పంపిణీ, గృహ నిర్మాణాలు, జల్ జీవన మిషన్లో చేపట్టిన తాగునీటి పథకాల నిర్మాణాలు, ఐసిడిఎస్ సేవలు, వ్యవసాయ, ఉద్యాన వన శాఖలు, కాఫీ తోటలు పెంపకం, మనబడి నాడు నేడులో పాఠశాలలకు మౌలిక సదుపాయాలు, , కీటక జనిత వ్యాదుల నివారణ చర్యలు, సికిల్సెల్ ఎనిమియా పరీక్షలు, ప్రభుత్వ ప్రాధాన్యతా భవన నిర్మాణాల పురోగతిపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.
జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా మాట్లాడుతూ, జిల్లాలో ఆపరేషన్ పరివర్తన్ కింద గంజాయి నిర్మూలనకు చేపట్టిన చర్యలను వివరించారు. గంజాయి సాగు స్థానంలో రైతులకు ప్రత్యామ్నాయ పంటలకు విత్తనాలు, ఉద్యానవన మొక్కలు పంపిణీ చేసామని చెప్పారు. ముందుగా అల్లూరి సీతారామరాజు విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. సమావేశం అనంతరం కలెక్టరేట్ ప్రాంగణంలో సి ఎస్ మొక్కలు నాటారు. వైద్య కళాశాల నిర్మాణపు పనులు పరిశీలించారు.ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ జె.శివ శ్రీనివాసు, పాడేరు ఐటిడిఏ పిఓ వి. అభిషేక్ రంప చోడవరం పిఓ సూరజ్ గనోరే, సీతంపేట పిఓ కల్పనా కుమారి, పార్వతీపురం పిఓ సి.విష్ణు చరణ్, రంపచోడవరం సబ్ కలెక్టర్ శుభం బన్సల్, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం జిల్లాల జిల్లాల అధికారుతలు పాల్గొన్నారు.










