Sep 26,2023 00:42

సమావేశంలో మాట్లాడుతున్న ఐటిడిఎ పిఒ సూరజ్‌ గనోరే

ఐటిడిఎ పిఒ సూరజ్‌ గనోరే
ప్రజాశక్తి-రంపచోడవరం

ఏజెన్సీలోని వెనుకబడిన మండలాల్లో మౌలిక సదుపాయాలు కల్పించడానికి తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందని రంపచోడవరం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి సూరజ్‌ గనోరే పేర్కొన్నారు. సోమవారం స్థానిక ఐటీడీఏ సమావేశపు హాలులో గిరిజన సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్‌, వై.రామవరం, మారేడమిల్లి, గంగవరం మండలాలకు సంబంధించిన ఎంపీడీవోలు, ఎటిడబ్ల్యుఓలు, ఎంఇఒలు, వివిధ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులు, ఐసిడిఎస్‌ సిడిపిఓలు, ఆర్‌డబ్ల్యుఎస్‌ ఇంజనీర్లు, వెలుగు ఏపీడి, ఏపిఎంలతో కేంద్ర ప్రభుత్వం నీతి అయోగ్‌ ద్వారా మౌలిక సదుపాయాల కల్పనపై ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పిఒ గనోరే మాట్లాడుతూ బాగా వెనకబడిన మండలాల్లోని గ్రామాలలో ప్రజలకు వివిధ రకాలైన మౌలిక సదుపాయాలు కల్పనకు నివేదికలు తయారు చేసి ఇవ్వాలని వివిధ శాఖలకు సంబంధించిన అధికారులను ఆదేశించారు. నీతి అయోగ్‌ ద్వారా ఒక బ్లాక్‌ డెవలప్మెంట్‌ను ఏర్పాటు చేసి మారుమూల గ్రామాలు అభివృద్ధికి ఎంపీడీవోలకు ఎపియస్‌ఆర్‌ఐడిటీ హైదరాబాదులో శిక్షణ ఇవ్వడం జరిగిందని చెప్పారు. జిల్లా స్థాయిలో జిల్లా కలెక్టర్‌, డివిజన్‌ స్థాయిలో ప్రాజెక్టు అధికారి, మండల స్థాయిలో ఎంపీడీవోలు నోడల్‌ అధికారులుగా నీతి అయోగ్‌ ఏర్పాటు చేయడం చేసినట్లు చెప్పారు. రంపచోడవరం డివిజన్లోని వై.రామవరం, మారేడుమిల్లి, గంగవరం మండలాలలో వివిధ ప్రభుత్వ ఆసుపత్రులకు కావాల్సిన సదుపాయాలపై లిఖితపూర్వకంగా జాబితా తయారు చేసి సమర్పించాలని వైద్యాధికారులను ఆదేశించారు. గిరిజన విద్యార్థులకు క్వాలిటీ విద్యను అందించేందుకు, ఐసిడిఎస్‌ ద్వారా లబ్ధిదారులకు సౌకర్యాల కల్పనకు, ప్రతి ఇంటికి తాగునీటి సరఫరాకు, విద్యుత్‌ సమస్యలు పరిష్కారం తదితర వాటిపై తీసుకోవాల్సిన చర్యలపై నివేదిక ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్‌ ధనరాజ్‌. జిల్లా శిక్షణ శాఖ ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ సూర్యలక్ష్మి, వెలుగు ఎపీడీ ఎ.శ్రీనివాసరావు, ఎన్‌ఆర్‌ఇజిఎస్‌ ఎపిడి రాంబాబు, ఎటిడబ్ల్యూఓ రామతులసి, ఎంఇఒలు తాతఅబ్బాయి దొర, బి.తమ్మారావు, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ రాజేంద్ర బాబు, ఏపీపీడీసీఎల్‌ ఇంజనీర్లు శ్రీనివాసరావు దొరబాబు, శ్రీనివాసరావు, ఎంపీడీవోలు జయంతి, శ్రీనివాస్‌, సిడిపిఓలు లక్ష్మీ ప్రసన్న, లక్ష్మి, ఆర్‌డబ్ల్యుఎస్‌ అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్లు పాల్గొన్నారు.