May 08,2023 21:42

ప్రజాశక్తి - జంగారెడ్డిగూడెం
             మండలంలోని మైసన్నగూడెం రహదారి నిర్మించాలని టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి దాసరి శ్యామ్‌ చంద్రశేషు, పార్టీ మండల అధ్యక్షులు ఎస్‌.సత్యనారాయణ డిమాండ్‌ చేశారు. ఈ మేరకు స్థానిక ఆర్‌డిఒ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన స్పందన కార్యక్రమంలో ఆర్‌డిఒ జాన్సిరాణికి టిడిపి ఆధ్వర్యంలో వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా శ్యామ్‌ చంద్రశేషు, సత్యనారాయణ మాట్లాడుతూ మైసన్నగూడెం రోడ్డు అధ్వానంగా ఉండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. వైసిపి రోడ్డు నిర్మాణం చేపడతామని స్థానిక ఎంఎల్‌ఎ ఎలిజా అనేకసార్లు ఇచ్చిన హామీని నెరవేర్చలేదన్నారు. అధికారులు స్పందించి రోడ్డు నిర్మాణం చేపట్టాలని కోరారు. గతేడాది డివిజనల్‌ స్థాయి స్పందన కార్యక్రమంలో ఫిర్యాదు చేయగా 30 రోజుల్లో సమస్యను పరిష్కరిస్తామని చెప్పి 30 రోజుల తర్వాత మీ సమస్య పరిష్కారమైందని ఫోన్‌లో మెసేజ్‌లు పంపడం సరికాదని తెలిపారు. ఈ రోడ్డు నిర్మాణానికి రూ.3.88 కోట్ల నిధులు మంజూరైనప్పటికీ నిర్మాణం మాత్రం చేపట్టలేదన్నారు. అనంతరం టిడిపి నేతలు ఆర్‌డిఒ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. త్వరలో రోడ్డు నిర్మాణం చేపట్టకపోతే భారీ ఎత్తున జన సమీకరణ చేసి ఎంఎల్‌ఎ క్యాంపు కార్యాలయం ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర బిసి సెల్‌ కార్యదర్శి చిట్టిబోయిన రామలింగేశ్వరరావు, మండల తెలుగు రైతు అధ్యక్షుడు ఎలికే వరప్రసాద్‌, మండల ఎస్‌సి సెల్‌ అధికార ప్రతినిధి తాళ్లూరు వెంకటేశ్వరరావు, పట్టణ తెలుగు యువత అధ్యక్షుడు కోనేటి చంటి పాల్గొన్నారు.