Oct 24,2023 20:29

వాహనదారులకు కౌన్సెలింగ్‌ ఇస్తున్న ఎస్‌పి

 కడప అర్బన్‌ : రోడ్డు ప్రమాదాల నియంత్రణే లక్ష్యంగా ఎస్‌.పి సిద్దార్థ్‌ కౌశల్‌ వినూత్న సందేశాత్మక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. తల్లిదండ్రుల్లో చైతన్యం తీసుకువచ్చేందుకు వారికి పెద్ద ఎత్తున కౌన్సెలింగ్‌ చేపట్టారు. తల్లిదండ్రులు నిబంధనలకు విరుద్దంగా మైనర్‌ పిల్లలకు వాహనాలు ఇచ్చి వారి అందమైన భవిష్యత్తును ప్రమాదంలోకి నెట్టవద్దని, అజాగ్రత్త, నిర్లక్ష్యంతో పిల్లలకు వాహనాలు ఇవ్వడం చట్టరీత్యా నేరమని ఎస్‌పి పేర్కొన్నారు. మంగళవారం స్థానిక పోలీస్‌ పెరేడ్‌ గ్రౌండ్‌లో ఇటీవల నగరంలో ఎస్‌పి పర్యవేక్షణలో నిర్వహించిన స్పెషల్‌ డ్రైవ్‌ లో పట్టుబడ్డ 1004 వాహనాలను కౌన్సెలింగ్‌ కార్యక్రమం నిర్వహించి తల్లిదండ్రులకు అప్పగించి గట్టిగా వార్నింగ్‌ ఇచ్చారు. పట్టుబడ్డ వాహనాల్లో బుల్లెట్‌ వాహనంపై పర్యటిస్తూ స్వయంగా తనిఖీల్లో పాల్గొని 296 వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్బంగా ఎస్‌పి సిద్దార్థ్‌ కౌశల్‌ మాట్లాడుతూ మరోసారి పట్టుబడితే తల్లిదండ్రులపై కేసులు నమోదు చేసి వాహనాలను కోర్టులో అప్పజెప్పి సీజ్‌ చేయిస్తామని హెచ్చరించారు. అజాగ్రత్త, నిర్లక్ష్యం వద్దని సూచించారు. తెలిసి తెలియని వయసులోని పిల్లలకు వాహనాలు ఇవ్వడం ద్వారా మీ పిల్లల ప్రాణాలతో పాటు రోడ్డుపై వెళ్లే అమాయకులైన ఎదుటి వారికి ప్రాణాపాయం జరుగుతుందని గుర్తుంచుకోవాలని తెలిపారు. అర్ధరాత్రి పూట అనవసరంగా రోడ్లపై తిరుగుతూ పోలీసులకు పట్టుబడ్డ ఆకతాయిలకు ఎస్‌పి కౌన్సెలింగ్‌ ఇచ్చారు. అదనపు ఎస్‌పి తుషార్‌ డూడి మాట్లాడుతూ ప్రజలు పోలీస్‌ సేవలను గుర్తించలేని పరిస్థితిలో ఉంటారని, వాహన తనిఖీల్లో ఎవరైనా సిబ్బంది వాహనాన్ని ఆపినప4డు ఎదురు ప్రశ్నిస్తారని, కానీ వారిని ప్రమాదాల బారిన పడకుండా సురక్షితం చేయడమే పోలీసుల ఉద్దేశమని తెలిపారు. మంచి కార్యక్రమాన్ని ఎస్‌పి నిర్వహించడాన్ని అందరూ స్వాగతిస్తున్నారని, ఇది శుభ పరిణామమని చెప్పారు. కార్యక్రమంలో ఎఆర్‌ అదనపు ఎస్‌పి కష్ణారావు, కడప డిఎస్‌పి ఎం.డి షరీఫ్‌, ఎఆర్‌ డిఎస్‌పి బి. రమణయ్య, నగరంలోని సిఐలు, ఎస్‌ఐలు పాల్గొన్నారు.