ప్రజాశక్తి -ఆనందపురం : తర్లువాడ గ్రామంలోని కొండపై మైనింగ్‌కు అనుమతులు నిలిపివేసి గ్రామాన్ని కాపాడాలని భీమిలి ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావుకు గ్రామస్తులు వినతిపత్రం అందజేశారు. ఆనందపురం మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన సర్వసభ్య సమావేశానికి హాజరైన ఎమ్మెల్యేకు స్థానిక సర్పంచ్ బిఆర్‌బి నాయుడు, మాజీ సర్పంచ్ అయ్యప్ప ఆధ్వర్యాన గ్రామస్తులు వినతిపత్రం అందజేశారు. గ్రామస్తుల పశుపోషణకు, పర్యావరణ పరిరక్షణకు ఉపయోగపడే కొండను మైనింగ్ పేరుతో అమ్మేయడం సరికాదన్నారు. ఈ విషయంపై అధికారులు సహకరించి మైనింగ్‌కు అనుమతులు ఇవ్వొద్దని కోరారు. దీనిపై ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు మాట్లాడుతూ, గ్రామస్తుల అభిప్రాయాలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి కృషిచేస్తానని హామీ ఇచ్చారు.
మాజీ సర్పంచ్‌పై ఆగ్రహం
2018లో తర్లువాడ పంచాయతీ సర్పంచ్‌గా ఉన్న మజ్జి వెంకటరావు గ్రామస్తులను సంప్రదించకుండా మైనింగ్‌కి అనుమతి ఇచ్చారంటూ గ్రామస్తులు మండిపడ్డారు. దీంతో సర్వసభ్య సమావేశ ప్రాంగణంలో మజ్జి వెంకటరావు వర్గీయులకు, గ్రామస్తులకు మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. మైనింగ్‌కు తాను అనుమతి ఇచ్చానంటే ప్రస్తుతం ఎంపిపిగా ఉన తన కుమార్తెచే రాజీనామా చేయిస్తానని మజ్జి వెంకటరావు గ్రామస్తులకు సవాల్ విసిరారు. ఎమ్మెల్యే కల్పించుకొని ఇరు గ్రూపులు తన కార్యాలయానికి వస్తే పరిష్కరించుకుందామన్నారు.










