Apr 20,2023 00:01

అధికారులను అడ్డగిస్తున్న జెడ్‌పిటిసి గంగరాజు, నాయకులు గిరిజనులు

ప్రజాశక్తి-అనంతగిరి: గిరిజన చట్టాలు, హక్కులను తుంగలో తొక్కి మైనింగ్‌ తవ్వకాల ప్రజాభిప్రా సేకరణకు వచ్చిన అధికార బృందాన్ని స్థానిక సిపిఎం జెడ్పిటిసి దీసరి. గంగరాజు, సమంత ఆర్గనైజర్‌ డైరెక్టర్‌ రబ్బ ప్రగాఢ రవి, గిరిజనులు బుధవారం అడ్డుకున్నారు.
జాయింట్‌ కలెక్టర్‌ శివ శ్రీనివాస్‌, ఖనిజ సంపద కాలుష్య నియంత్రణ అధ్యక్షతన ఏపీఎండిసి అధికారుల బృందంతో మండలంలోని వాలసీ పంచాయతీ పరిధి నిమ్మలపాడు, రాళ్లగరువు గ్రామం వద్ద జరిగిన మైనింగ్‌ ప్రజాభిప్రా సేకరణ అధికార బృందాన్ని నిలదీశారు. స్థానిక సర్పంచ్‌ గిరిజనులు మైనింగ్‌ తవ్వకాలకు వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు. నిమ్మలపాడు గ్రామం లో ప్రారంభమైన ర్యాలీ కరకవలస, రాళ్లగెడ్డలో ఏర్పాటు చేసిన సభా వేధిక వరకు భారీ ర్యాలీ చేపట్టారు. సభా వేదికలో హాజరైన జాయింట్‌ కలెక్టర్‌, ఖనిజ సంపద కాలుష్య నియంత్రణ, స్థానిక తహాసిల్దార్‌, ఏపీఎండీసీ అధికారులను ప్రజాప్రతినిధులు, గిరిజనులు ప్రశ్నించారు.ప్రజా అభిప్రాయ సేకరణ నిర్వహిస్తున్నట్లు ప్రజా ప్రతినిధులు, గిరిజనులకు ఎటువంటి సమాచారం ఎందుకు ఇవ్వలేదని నిలదీశారు. ఎటువంటి ప్రజాభిప్రా సేకరణ లేకుండా గత 18 సంవత్సరాలుగా మైనింగ్‌ జరపడం సరికాదని, దీంతో తమ పంట పొలాలు కాలుష్యంతో దెబ్బతింటున్నాయని, పలు రోగులతో తాము ఇబ్బందులకు గురవుతున్నామని తెలిపారు. ఇప్పటివరకు అక్రమంగా తవ్వకాలు జరిపిన మైనింగ్‌ ప్రాంతాన్ని పరిశీలించాలని అధికారులను చుట్టుముట్టి నిలదీశారు. దీంతో ఆ ప్రాంతంలో సందర్శించారు. అనంతరం సభా వేదికకు వచ్చిన అధికారులు గిరిజన ప్రజలు, స్థానిక ప్రజా ప్రతినిధుల నుంచి వేరువేరుగా అభిప్రాయాలను నమోదు చేసుకున్నారు.
ఈ సభ వేదికను ఉద్దేశించి జెడ్పిటిసి గంగరాజు మాట్లాడుతూ, వాలసి పంచాయతీ తూభుర్తి. కరకవలస, రాళ్లగెడ్డ గ్రామాలకు అనుకొనున్న కాల్‌ సైట్‌ మైనింగ్‌ 2006 సంవత్సరం నుంచి బినామీ దారులతో తవ్వకాలు జరుపుతున్నారన్నారు. బినామీ దారులైన దురియా రుక్మిణి, రొబ్బ శంకరరావులు మైనింగ్‌ కొల్లగొట్టి దోచుకున్నారని విమర్శించారు. గ్రామ అభివద్ధి, పనిచేసిన రైతులకు కనీస కూలి చెల్లించకుండా కోట్ల రూపాయలు మైనింగ్‌ మాఫియా దోచుకుందన్నారు. మైనింగ్‌ యాక్ట్‌ ప్రకారం గ్రామ పంచాయతీకి రాయల్టీ చెల్లించాల్సి ఉందన్నారు. ఏపీఎండిసి పేరుతో బినామీ వ్యవస్థను పెట్టి మైనింగ్‌ తవ్వకాలు జరితే చూస్తూ ఊరుకునేది లేదని, గిరిజనుల పక్షాన అంటూ న్యాయం జరిగే వరకూ తమ పోరాటాన్ని ఉదృతం చేస్తానని హెచ్చరించారు.పూర్తిగా మైనింగ్‌ లీజులను రద్దు చేసి గిరిజన భూములు గిరిజనులకు అప్పగించాలని ఆయన డిమాండ్‌ చేశారు.
సమత డైరెక్టర్‌ రవి మాట్లాడుతూ, నిమ్మలపాడు కాల్‌ సైట్‌ మైనింగ్‌ తవ్వకాలు నిర్వహించేందుకు టాటా, బిర్లా అప్పట్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో ఒప్పందం కుదిరించుకుందని తెలిపారు. దీనికి వ్యతిరేకంగా గిరిజనుల పక్షాన సుప్రీంకోర్టులో కేసు వేయడం జరిగిందన్నారు. తమకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడంతో టాటా, బిర్లా సంస్థలు వెనుక్కు వెళ్లి పోయారని, ఇదే గతి ఏపీఎండిసికు పడుతుందని తెలిపారు.పంచాయితీ, .పీసా అనుమతులు లేకుండా ఇష్టం రాజ్యంగా మైనింగ్‌ తవ్వకాలు నిర్వహిస్తే చూస్తూ ఊరుకునేది లేదన్నారు.
సర్పంచ్‌ సెంబి. సన్యాసిరావు మాట్లాడుతూ గ్రామ పంచాయతీ, ప్రజలకు నష్టానికి గురి చేసే మైనింగ్‌ తవ్వకాలకు వ్యతిరేకిస్తూ ప్రజల పక్షాన ఉంటానన్నారు.జాయింట్‌ కలెక్టర్‌ శివ శ్రీనివాస్‌ మాట్లాడుతూ, మైనింగ్‌ తవ్వకాలను పరిశీలించి ప్రభుత్వానికి, అధికారులకు తెలియపరచాలని ఆయన ఆదేశించారు ఈ కార్యక్రమంలో ఖనిజ సంపద కాలుష్య నియంత్రణ ఇంజనీరింగ్‌ అధికారి. సుదర్శన్‌, తహసిల్దార్‌ రామ భాయి, సిపిఎం టోకూరు సర్పంచ్‌ కె.మొసియా, మండల కార్యదర్శి ఎస్‌.నాగులు, వాలసి మాజీ సర్పంచ్‌ ధర్మన్న, గురుమూర్తి, గ్రామస్తులు పాల్గొన్నారు.