Aug 25,2023 19:03

తహశీల్దార్‌కు వినతిపత్రం ఇస్తున్న ఎస్టీలు, నాయకులు

ప్రజాశక్తి - నకరికల్లు : ఎస్టీలు సాగు చేసుకుంటున్న భూములకు పట్టాలివ్వాలని సిపిఎం పల్నాడు జిల్లా కార్యదర్శి గుంటూరు విజరుకుమార్‌ డిమాండ్‌ చేశారు. ఈ మేరకు తహశీల్దార్‌కు ఎస్టీలతో కలిసి నాయకులు శుక్రవారం వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా విజరుకుమార్‌ మాట్లాడుతూ చేజర్లలో సుబ్బయ్యకుంటలో 40 ఏళ్ల నుండి ఎస్టీలు సాగు చేసుకుంటున్న భూముల్లో 49 ఎకరాలను 2014లో గ్రామానికి చెందిన కాసా వెంకట్రావుకు మైనింగ్‌ కోసం 2034 వరకు అనుమతిచ్చారని తెలిపారు. ప్రస్తుతం ఆ భూముల్లో మైనింగ్‌ చేపట్టడంతో ఇతర పొలాలకు ఇబ్బందిగా మారిందని, మైనింగ్‌ పనులను సత్వరమే నిలిపేయాలని డిమాండ్‌ చేశారు. సమస్యను పరిష్కరించకుంటే ఆందోళన ఉధృతం చేస్తామన్నారు. ఈ మేరకు తహశీల్దార్‌ నగేష్‌, ఎస్‌ఐ బాలకృష్ణ యాదవ్‌కు వినతిపత్రాలు ఇచ్చారు. ఇదే విషయాన్ని వైసిపి మండల కన్వీనర్‌ బి.రాఘవరెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. తహశీల్దార్‌ మాట్లాడుతూ మైనింగ్‌కు ఇచ్చిన ప్రాంతాన్ని, ఎస్టీల భూములను పరిశీలించి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. వినతిపత్రం ఇచ్చిన వారిలో సిపిఎం మండల కార్యదర్శి జి.పిచ్చారావు, అప్పిరెడ్డి, ఎస్‌.రామాంజి నాయక్‌, కొండ నాయక్‌, దుర్గాబాయి, భారతిభాయి, గౌరీ బాయి ఉన్నారు.