వాల్మీకిపురం : పట్టణంలోని తరిగొండ రోడ్డులో ప్రభుత్వ మైనార్టీ బాలికల గురుకుల పాఠశాలలో విద్యార్థులకు మెరుగైన విద్యను అందిస్తున్నారని, ఇక్కడ విద్యను అభ్యసించే పిల్లలకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని రాష్ట్ర ఉర్దూ అకాడమీ డైరెక్టర్ అబ్దుల్ కలీమ్ అన్నారు. బుధవారం స్థానిక మైనార్టీ బాలికల గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ మంజుల సూచనల మేరకు ఉపాధ్యాయులు అడ్మిషన్ల ప్రచార కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఉర్దూ అకాడమీ డైరెక్టర్ అబ్దుల్ కలీమ్ మాట్లాడుతూ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి ప్రత్యేక కషితో 2003లో ఈ గురుకుల పాఠశాలను ప్రారంభించడం జరిగిందని, ఈ పాఠశాలలో అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు, నాణ్యమైన విద్య, మెరుగైన పౌష్టికాహారం అందుబాటులో ఉందన్నారు. రాష్ట్రంలోనే సిబిఎస్‌ఇ సెంట్రల్ సిలబస్ అమలులో ఉన్న తొలి మైనార్టీ గురుకుల పాఠశాలగా ఈ పాఠశాల గుర్తింపు పొందిందని, ఈ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియంలో అడ్మిషన్లు నిర్వహిస్తున్నప్పటికీ ఉర్దూను ఫస్ట్ లాంగ్వేజ్‌గా బోధిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం 5వ తరగతిలో ఎలాంటి ఎంట్రన్స్ టెస్ట్, రుసుములు లేకుండా ఉచితంగా అడ్మిషన్లు చేపడుతున్నారని, ఇక్కడ చేరే విద్యార్థులకు ఉచిత విద్య, వసతి, భోజన సదుపాయాలు, పిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. తల్లితండ్రులు 5వ తరగతి విద్యాభ్యాసం కోసం తమ పిల్లలను ఈ గురుకుల పాఠశాలలో చేర్పించాలని, మరిన్ని వివరాల కోసం ప్రిన్సిపల్ మంజుల, 9866559649 మొబైల్ నెంబర్ ద్వారా సంప్రదించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల కో ఆప్షన్ సభ్యుడు మహబూబ్ బాషా, విశ్రాంత హెచ్‌ఎం జవాద్ హుస్సేన్ సాహెబ్, ఉపాధ్యాయులు జిలాని, సయ్యద్ ఆజం, షఫీ, తదితరులు పాల్గొన్నారు.
ప్రచారం నిర్వహిస్తున్న ఉర్దూ డైరెక్టర్ అబ్దుల్ కలీమ్, ఉపాధ్యాయులు










