Jan 11,2023 22:48

ప్రజాశక్తి - విజయవాడరూరల్‌ 

విజయవాడ రూరల్‌ మండలం నున్నలో ఎపి రెసిడెన్షియల్‌ మైనార్టీ బాలికల పాఠశాల ఏర్పాటు కానుంది. ఆ పాఠశాలకు నున్నలో ప్రతిపాదించిన స్థలం ను ఎన్టీఆర్‌ జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ నుపూర్‌ అజరు బుధవారం పరిశీలించారు. రెండు దశాబ్ధాల క్రిత (2003లో) మైనార్టీ బాలికల కోసం విజయవాడలో ఈ పాఠశాలను ఏర్పాటు చేశారు. తొలుత విద్యాధర పురంలోని ఆర్‌టిసి శిక్షణ కేంద్రంలో తాత్కాలికంగా పాఠశాలను ఏర్పాటు చేయగా, ప్రస్తుతం ఐరన్‌ యార్డులోని అద్దె భవనంలో నడుస్తోంది. ప్రస్తుతం పాఠశాలలో సుమారు 200 మంది బాలికలు విద్యాభ్యాసం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మైనార్టీ బాలికల పాఠశాలకు శాశ్వత ప్రాతిపదికన భవన నిర్మాణం చేపట్టేందుకు స్థలం కేటాయించాలని ఎపి రెసిడెన్షియల్‌ ఎడ్యుకేషనల్‌ ఇన్‌స్టిట్యూషన్‌ సొసైటీ కార్యదర్శి ఇటీవల ఎన్‌టిఆర్‌ జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎస్‌ ఢిల్లీరావుకు ప్రతిపాదనలు పంపించారు. విజయవాడ రూరల్‌ మండలం నున్నలో 2006లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కోసం ఆర్‌ ఎస్‌ నంబర్‌ 370/1, 370/3 లో సుమారు ఐదు ఎకరాల భూమిని రెవెన్యూశాఖ సేకరించింది. అయితే, ప్రస్తుతం ఆ భూమి ఖాళీగా వుంది. ఈ స్థలం అనువుగా వుందని గుర్తించారు. ఈ కార్యక్రమం లో రూరల్‌ తహసీల్దార్‌ శ్రీనివాస్‌ నాయక్‌, తదితరులు ఉన్నారు.