కడప ప్రతినిధి : జిల్లాలోని భారీ సాగునీటి ప్రాజె క్టుల్లో మైలవరం ఒకటి. ఇటువంటి ప్రాధాన్యత ప్రాజెక్టు రెండేళ్ల కిందట కురిసిన భారీ వర్షాల ధాటికి మరమ్మతులకు గురైంది. రాయలసీమకే తలమానికమైన గండికోట రిజర్వాయర్‌కు అనుసంధానమై ఉంది. 9.99 టిఎంసిల నిల్వ సామర్థ్యం. 74 వేల ఎకరాల ఆయకట్టును కలిగి ఉంది. రిజర్వాయర్ మరమ్మతులకు నిరీక్షణ తప్పడం లేదు. గతేడాది ఆగస్టులో జిల్లా నీటిపా రుదల శాఖ రూ.80 కోట్లతో ప్రతిపాదనలు అందజేసింది. రాష్ట్ర ఇరిగేషన్ ఇంజినీరింగ్ విభాగం రిమార్క్స్ పేరిట వెనక్కి పంపించింది. జిల్లా నీటిపారుదల శాఖ ఇంజినీరింగ్ యంత్రాంగం రిమార్క్స్‌ను సవరించి మళ్లీ ప్రతిపాదనల్ని పంపించింది. అయినప్పటికీ సుమారు ఏడాదిగా పాలనామోదానికి నిరీక్షించాల్సి వస్తోంది. పాలనా మోదం అనంతరం సాంకేతిక అనుమతులు, టెండర్లు, అగ్రిమెంట్ల వ్యవహారం పూర్తి చేసే సమయానికి పుణ్యకాలం ముగుస్తుంది.
మైలవరానికి మరమ్మతులివే!
మైలవరం రిజర్వాయర్‌కు రివిట్‌మెంట్ దగ్గర నుంచి గెస్ట్‌హౌస్, గోడలు, గేట్లు, కట్ట, లెఫ్ట్ బ్లాంక్, ప్రొటెక్షన్‌వాల్, ఫ్లడ్‌గేట్, లైటినింగ్, రహదారి, గేట్లు, ఉత్తర, దక్షిణ కాల్వలు మొదలగు నిర్మాణ పనులు దెబ్బతిని శిథిలావస్థకు చేరువలో ఉన్నాయి. గతేడాది లెఫ్ట్ కెనాల్‌లో పెరిగిన కంప చెట్లు, ఈదర మొక్కలను తొలగించారు. మళ్లీ యథాతథ పరిస్థితులు నెల కొనడంతో ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ స్పందించి జిల్లా నీటి పారుదలశాఖ సహకారంతో రూ.80 కోట్లతో ప్రతిపాదనలను అందజేశారు.
12 నెలలుగా తప్పని నిరీక్షణ
ఏడాదిగా అడ్మినిస్ట్రేషన్, టెక్నికల్ అనుమతుల కోసం జిల్లా నీటిపారుదల శాఖ నిరీక్షిస్తోంది. రాష్ట్ర నీటిపారుదల శాఖ ఇంజినీరింగ్ యంత్రాంగం రిమార్క్స్ పేరిట అనుమతులు ఇవ్వడంలో కాలయాపన చేస్తోంది. ముఖ్యమంత్రి జిల్లాకు చెందిన బారీ ప్రాజెక్టు పరిస్థితి ఇలా ఉంటే మిగిలిన మధ్య తరహా, చిన్న తరహా ప్రాజెక్టుల పరిస్థితి ఎలా ఉంటుందో ఊహిం చుకోవాల్సిందే. రాబోయే నెల నుంచి వర్షాకాలం సీజన్ మొదలు కానుంది. సహజంగా ఆగస్టు, అక్టోబర్, నవంబర్ మాసాల్లో వరదలు పోటెత్తితే మైలవరం ప్రాజెక్టు పరిస్థితేమిటో తెలియడం లేదు. ఇప్పటికైనా రాష్ట్ర నీటిపారుదల శాఖ స్పందించి మైలవరం సాగునీటి ప్రాజెక్టు మరమ్మతుల పనుల్ని వేగవంతం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందనడంలో సందేహంలేదు. దీనిపై బాధ్యత ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్‌ను సంప్రదించగా ప్రతిపాదనలు ఆమోదం లభించిన వెంటనే పనులు చేపడతామని పేర్కొనడం గమనార్హం.










