Sep 15,2023 20:53

అస్తవ్యస్తంగా గోదావరి డెల్టా కాలువలు
కలుషిత జలాలతో ప్రజలకు రోగాలు
కాల్వల పరిరక్షణకు నిఘా వ్యవస్థ తప్పనిసరంటున్న రైతులు
ప్రజాశక్తి - భీమవరం రూరల్‌
గోదావరి డెల్టాలో సాగునీటి కాలువల వ్యవస్థ నిర్వీర్యమవుతోంది. దీనికి ప్రధాన కారణం మైలు కూలీలు, లస్కర్ల పోస్టులు ఖాళీ అవుతున్నా గత మూడు దశాబ్దాలుగా భర్తీ చేయకపోవడమే. ఫలితంగా కాలువల మీద పర్యవేక్షణ పూర్తిగా కొరవడింది.
గోదావరి డెల్టాలో ఏ ప్రాంతంలో చూసినా పంట కాలువలన్నీ కలుషిత జలాలు, ప్లాస్టిక్‌ వ్యర్థాలు, గుర్రపుడెక్క, తూడు, ఫ్యాక్టరీల వ్యర్థాలతో కలుషితమవుతున్నాయి. ఈ సమస్యను పరిష్కరించాల్సిన ప్రభుత్వాలు అటువైపు కన్నెత్తి చూడటం లేదు. ఫలితంగా ప్రజలు తాగునీటి సంబంధమైన రోగాల బారిన పడుతున్నారు. నూటికి 80 శాతం రోగాలు నీటి వల్లే వస్తాయని వైద్య గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఎంతో ప్రాధాన్యత కలిగిన గోదావరి డెల్టాలో సాగు, తాగునీటి కాలువల వ్యవస్థకు 150 సంవత్సరాల ఘన చరిత్ర ఉంది. అయితే గత మూడు దశాబ్దాలుగా లస్కర్లు, మైలు కూలీల పోస్టులు ఖాళీ అవుతున్నా ఏఒక్కటీ భర్తీ చేయడం లేదు. దీనివల్ల ఆయా ప్రాంతాల్లో నీటిపారుదల వ్యవస్థ రూపురేఖలు మారిపోయింది. గతంలో మైలు కూలీలు తమకు కేటాయించిన ప్రాంతంలో సంచరిస్తూ ఎప్పటికప్పుడు కాలువల తీరును గమనించేవారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు తిరుగుతూ ఎవరైనా చెత్తాచెదారం వేస్తే అడ్డుకునేవారు. కాల్వ గట్లు అంచుల వెంబడి తూడు, గుర్రపుడెక్క, కర్రనాచు వంటివి పెరిగితే వాటిని ఎప్పటికప్పుడు శుభ్రం చేసేవారు. అదే విధంగా గట్లు పటిష్టపర్చడానికి నిద్రగన్నేరు చెట్లను విరివిగా పెంచేవారు. దీనివల్ల కాలవగట్లు పటిష్టంగా ఉండటమే కాకుండా చూడటానికి ఆహ్లాదకరంగా ఉండేది. నిద్రగన్నేరు చెట్లతోపాటు మామిడి తదితర ఫల సాయమిచ్చే చెట్లను కూడా పెంచేవారు. దీనివల్ల ఆ మార్గంలో ప్రయాణించే వారికి నీడ కూడా దొరికేది. ప్రస్తుత పాలకులు ఇవేమీ పట్టించుకోవడం లేదు. పంట కాలువల నిర్వహణను గాలికొదిలేశారు. పంట కాల్వలకు ఆనుకుని ఏర్పాటైన పరిశ్రమల వ్యర్థాలను సైతం వీటిలోకి విడుదల చేయడంతో కాల్వ నీరు కలుషితమవుతోంది. దీనివల్ల పంటలు దెబ్బతినడంతోపాటు తాగునీటిగా ఉపయోగించిన ప్రాంతాల్లో జనం రోగాల పాలవుతున్నారు. భీమవరం, నరసాపురం, పాలకొల్లు, తణుకు, తాడేపల్లిగూడెం తదితర ప్రాంతాల్లో ఈ దుస్థితి నెలకొంది.
రెండు దశాబ్దాల కాలంగా ఆక్వా సాగు జోరందుకోవడంతో పరిస్థితి మరింత దారుణంగా మారింది. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో మూడు లక్షలకుపైగా ఎకరాల్లో ఆక్వా సాగవుతోంది. వీటి నుంచి కలుషిత నీటిని నేరుగా పంట కాలువల్లోకి వదిలేస్తున్నారు. రొయ్యల సాగుకు సంబంధించి ఉప్పు నీటిని సైతం కాల్వల్లోకి వదలడంతో నీటి వనరులు పూర్తిగా దెబ్బతింటున్నాయి. ఈ నేపథ్యంలో కాలువల పరిరక్షణకు కచ్చితంగా మైలు కూలీలు, లస్కర్ల వ్యవస్థ తరహాలో కొత్త వ్యవస్థనైనా ఏర్పాటు చేసి బలోపేతం చేయాల్సిన అవసరం ఉందనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. తద్వారా ఎంతోకొంత కాల్వలను కాలుష్యం బారినుంచి రక్షించుకునే అవకాశం ఉంటుందని, అదే సమయంలో కాలుష్య కారకులపై ప్రభుత్వాలు కఠినంగా వ్యవహరించాలని ప్రజలు, రైతులు కోరుతున్నారు.