May 09,2023 23:50

మృతుని భార్యకు ఒప్పంద పత్రం అందజేస్తున్న దృశ్యం

ప్రజాశక్తి -పరవాడ : పరవాడ ఫార్మసిటీలోని మైలాన్‌ యూనిట్‌-9లో మంగళవారం విధులు నిర్వహిస్తున్న కార్మికుడు ఎం.శ్రీను (42) మృతి చెందాడు. కంపెనీలో విధులు నిర్వహిస్తుండగా, తీవ్ర అస్వస్థకు గురైన శ్రీనును విశాఖలోని ఒక ప్రైవేటు ఆసుపత్రికి తరలిస్తుండగా, మార్గమధ్యలో మృతి చెందాడు. వెంటనే కంపెనీ యాజమాన్య ప్రతినిధులు శ్రీను మృతదేహాన్ని ఆయన స్వగ్రామం అనకాపల్లి జిల్లా మునగపాక మండలం, నారాయణపాలెం గ్రామానికి తరలించారు.
దీనిపై కుటుంబ సభ్యులు, నారాయణపాలెం ఎంపీటీసీ ఎల్లప్ప నాగేశ్వరరావు, గ్రామ పెద్దలు, ఫార్మాసిటీ స్టాఫ్‌ అండ్‌ వర్కర్స్‌ యూనియన్‌ గౌరవ అధ్యక్షులు గనిశెట్టి సత్యనారాయణ తదితరులు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశారు. దీంతో యాజమాన్య ప్రతినిధి అరవింద్‌, వారితో చర్చలు జరిపారు. మృతుని కుటుంబానికి రూ.5.50 లక్షలు నష్టపరిహారం చెల్లించడానికి, రూ.4 లక్షలు గ్రాడ్యుటీ, తదితర చట్ట ప్రకారం రావలసినవి ఇవ్వడానికి, మృతుని భార్యకు పరిశ్రమలో ఉపాధి కల్పించడానికి, ప్రతి నెలా రూ.15వేలు పింఛను చెల్లించడానికి యాజమాన్యం అంగీకరించింది. దహన సంస్కారాలు ఖర్చులు నిమిత్తం వెంటనే రూ.50వేలు శ్రీను కుటుంబానికి అందజేశారు. ఈ విషయంపై కేసు నమోదు చేశారా? అని పరవాడ సిఐ పి.ఈశ్వరరావును ప్రజాశక్తి వివరణ కోరగా, తమకు ఎవరూ ఫిర్యాదు చేయలేదని తెలిపారు. ఫిర్యాదు లేనిదే తాము ఏమి చేయలేమని చెప్పారు.