ప్రజాశక్తి - భీమడోలు
ఆర్థిక శాస్త్రంలో నోబుల్ బహుమతి గ్రహీత, అమెరికా దేశానికి చెందిన మైఖేల్ రాబర్ట్ క్రెమెర్ తన బృందంతో భీమడోలు మండలం పూళ్ళ హైస్కూలును శుక్రవారం సందర్శించారు. ప్రపంచంలోని పలు విశ్వవిద్యాలయాలలో వివిధ హోదాల్లో అధ్యాపకులు, ఆచార్యులుగా పనిచేసిన క్రెమర్ ఆర్థిక శాస్త్రంలో తన పరిశోధనలకు గాను 2019వ సంవత్సరంలో మరొక ఇద్దరు శాస్త్రవేత్తలతో కలిసి నోబుల్ బహుమతి సంయుక్త గ్రహీతగా నిలిచారు. వివిధ అంశాలపై అధ్యయనానికి మన దేశ పర్యటన వచ్చిన ఆయన శుక్రవారం పూళ్ళ హైస్కూల్‌కు విచ్చేశారు. అక్కడ పిఎఎల్ విధానములో నిర్వహిస్తున్న గణితశాస్త్ర లేబరేటరీని సందర్శించారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడారు. ఈ సందర్భంగా టైం టేబుల్స్, బైజో టాబ్స్, ఐఎఫ్‌బి పెరల్స్‌పై విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు భువనేశ్వర్ రావుతో పాటు పాఠశాలకు చెందిన గణితశాస్త్ర ఉపాధ్యాయులు వెంకటేష్, కనకారావు, లీలా అపరంజిని, గణిత శాస్త్ర ప్రయోగశాల రాష్ట్ర సమన్వయకర్త కెవి.సత్యనారాయణ వాటి వినియోగం, విద్యార్థుల అవగాహన ఇతర అంశాల గురించి ఆయనకు తెలియజేశారు. ఆ తర్వాత గ్రామ సర్పంచి డి.సుజాత ప్రసాద్, ప్రముఖులు కేతిరెడ్డి విశ్వేశ్వరరావు, పాఠశాలకు చెందిన ఉపాధ్యాయ బృందం నోబుల్ బహుమతి గ్రహీతను సత్కరించారు.










