సామాన్యులకు ఆశలు చూపి మోసగించడం, అస్మదీయులకు ఖజానాను దోచి పెట్టడమే మోడీ సర్కారు విధానమని బుధవారంనాటి మంత్రివర్గ నిర్ణయాలతో మరోసారి స్పష్టమయ్యింది. ప్రధాని మోడీకి సన్నిహితుడైన గౌతం అదానీకి చెందిన సంస్థకు తిరువనంతపురం, జైపూర్, గౌహతి విమానాశ్రయాలను కట్టబెట్టడం ఆశ్రిత పెట్టుబడిదారీ విధానానికి నిలువెత్తు నిదర్శనం. చెరకు ఫెయిర్ యావరేజ్ ధర (ఎఫ్‌ఆర్‌పి)ను టన్నుకు రూ.2850గా ప్రకటించడం రైతులను దగా చేయడమే! గత ఏడాది కంటె కేవలం వంద రూపాయల పెంపుదల కంటి తుడుపు. ప్రభుత్వమే డీజిల్ ధరను 20 శాతం పైగా పెంచింది. ఎరువులు, పురుగు మందులు, నిత్యావసర సరుకుల ధరలూ విపరీతంగా పెరిగాయి. చక్కెర ధర కూడా మార్కెట్‌లో గత ఏడాది రూ.35-37 వున్నదల్లా ఇప్పుడు రూ.42-45 అమ్ముతోంది. అంటే పెరుగుదల సుమారు 22 శాతం. కాని, చెరకు ధరను కేవలం 3.6 శాతం పెంచడం రైతును మోసగించడం తప్ప ఇంకేమిటి? ఇక విద్యుత్ పంపిణీ సంస్థలకు రుణ పరిమితిని పెంచడం ద్వారా వినియోగదారులకు అంటే ప్రజలకు ఒరిగేదేమీ లేదు. అటు ప్రభుత్వంలోని పెద్దలు, ఇటు వారికి బాకాలూదే మీడియా గొప్పగా చెబుతున్న జాతీయ రిక్రూట్‌మెంట్ ఏజెన్సీ (ఎన్‌ఆర్‌ఎ) ఏర్పాటు ఒక బూటకం. యువతీ యువకులను మరిన్ని భ్రమలకు గురి చేసే మాయోపాయమిది.
కేంద్ర ప్రభుత్వ పరిధిలోని ఉద్యోగాల నియామకానికి కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్ (సిఇటి- సెట్) నిర్వహించేందుకు ఎన్‌ఆర్‌ఎ ఏర్పాటు చేస్తున్నామని మంత్రి చెప్పారు. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్‌ఎస్‌సి), రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (ఆర్‌ఆర్‌బి), ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ సర్వీస్ పర్సనల్ (ఐబిపిఎస్) కోసం ఎన్‌ఆర్‌ఎ తొలి దశగా ఈ పరీక్ష నిర్వహిస్తుంది. ప్రభుత్వరంగ బ్యాంకుల్లో, ఆ తరువాత ప్రముఖ ప్రైవేటు సంస్థల ఖాళీల భర్తీకి ఎన్‌ఆర్‌ఎ సెట్‌ను విస్తరింపజేస్తామనీ మంత్రులంటున్నారు. ఆన్‌లైన్‌లో నిర్వహించే ఈ పరీక్షలో ఉత్తీర్ణులైన వారు మూడేళ్ల పాటు ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చునట. దేశంలో ఎక్కడి నుంచైనా రాయవచ్చన్నది మరో గొప్ప అంశంలా చెబుతున్నారు. ఈ కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్ పాసయిన వారికి ఉద్యోగార్హత వచ్చినట్టు కాదు. ఉద్యోగార్హత పరీక్ష రాయడానికి అర్హత వస్తుంది. ఇందులో మోడీ ప్రభుత్వం కొత్తగా చేసిన ఉపకారం ఏమిటంటే ఇప్పటికే వివిధ ఉద్యోగాలకు తగిన అర్హతలున్నవారికి మళ్లీ అర్హత నిరూపించుకొమ్మని మరో పరీక్షను ముందుకు తేవడం! సంబంధిత ఉద్యోగ నియామకానికి ప్రస్తుతం వున్న పరీక్షకు ఈ సెట్ అదనం అవుతుంది. ఈ విధానాన్ని ఇకపై క్లర్క్‌తో సహా అన్ని ఉద్యోగాలకూ మోడీ సర్కారు తీసుకొస్తోంది. ఇందువల్ల యువతీ యువకులకు అదనపు శ్రమ, భారం తప్ప జరిగే మేలేమిటో కమలనాథులు, వారి పల్లకీ మోస్తున్న మీడియా సంస్థలూ వెల్లడించాలి. ఆన్‌లైన్ పరీక్ష ఇప్పుడే కొత్తగా వచ్చింది కాదు. చాలా ఏళ్లుగా అమలులో వున్నదే! అన్ని చోట్లా పరీక్షలు జరుగుతాయంటున్నారు కనుక కోచింగ్ సెంటర్లు మాత్రం పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తాయి. అలాగే స్టడీ మెటీరియల్ పబ్లిషర్లకూ ఇబ్బడి ముబ్బడి వ్యాపారం జరుగుతుంది. ఈ ఆన్‌లైన్ పరీక్షలు, కోచింగులు అందుబాటులో వుండని పేద, దళిత, గిరిజన బలహీన వర్గాలకు చెందిన యువతకు మరింత అన్యాయం జరుగుతుంది.
మోడీ పాలనా కాలంలో దేశంలో కొత్తగా ఉద్యోగాలేవీ రాలేదు సరికదా ఉన్నవి ఊడుతున్నాయి. ఎన్నడూ లేని విధంగా నిరుద్యోగిత పెరుగుతోంది. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామన్న బిజెపి ఎన్నికల హామీ ఒట్టి మాటగా తేలిపోయింది. విద్యార్థులు, నిరుద్యోగ యువతీ యువకుల్లో పాలకులపై అసంతృప్తి, ఆగ్రహం గూడు కట్టుకుంటున్నాయి. అది పెల్లుబుకకుండా వుండేందుకు పాలకులు చేస్తున్న జిమ్మిక్కులలో ఎన్‌ఆర్‌ఎ ఏర్పాటు ఓ భాగం మాత్రమే. ఉద్యోగ నియామకాలకు ఓ కొత్త దొంతరను సృష్టించి, దానికి వల్లమాలిన ప్రచారం కల్పించి అందరి దృష్టినీ ఆకర్షిస్తారు. ఆ తరువాత ఉద్యోగం రాకపోవడానికి నేను పరీక్షకు పాస్ కాకపోవడం కారణం తప్ప ప్రభుత్వ విధానాలు కారణం కాదనుకునేలా నిరుద్యోగుల మస్తిష్కాలను ప్రభావితం చేసే కుట్ర ఇది. ఇలాంటి మాయోపాయాలతో యువతీ యువకులను, దేశ ప్రజలనూ మోసగించగలమన్న పాలకుల ఆశలు అడియాసలు కాక మానవు. వివేకవంతులైన భారతీయులు పాలకుల కుట్రలను తిప్పికొట్టక మానరు.










