జమ్మూ, కాశ్మీర్‌లోని లాంబేరి గ్రామానికి చెందిన 23 ఏళ్ల మావ్య సుడాన్ రాజౌరి జిల్లా నుంచి భారత వైమానిక దళంలో (ఐఏఎఫ్)కు ఎంపికైన మొదటి మహిళా ఫైటర్ పైలట్. ఫ్లయింగ్ ఆఫీసర్లుగా నియమించబడిన మొదటి మహిళగా 2016లో చరిత్ర సృష్టించిన ఫ్లైట్ లెఫ్టినెంట్స్ అవని చతుర్వేది, భవనా కాంత్, మోహనాసింగ్ అడుగుజాడల్లో నడిచి, దేశంలో 12వ అధికారిణిగా మావ్య ఎంపికయ్యారు. ఎందరికో స్ఫూర్తినిచ్చే మావ్య కథ తెలుసుకుందాం పదండి..
ఆడపిల్ల ముగ్గులు వేయడానికి, కుట్లూ, అల్లికలకు మాత్రమే తన చేతివేళ్లను ఉపయోగించాలి అనుకునే సమాజంలో మావ్య సుడాన్ పెరిగి, పెద్దయ్యారు. చిన్నప్పటి నుంచే తన గది గోడలపై ఎగిరే యంత్రాల బొమ్మలను వేస్తూ ఎప్పటికప్పుడు మూస పద్ధతులకు చరమగీతం పాడారామె. అంతేనా స్కూల్ క్రీడల్లోనూ ఎప్పుడూ ముందుండేది మావ్య. 'చిన్నప్పటి నుంచి ఆమెను ఎవరూ ఫైటర్ ఫైలట్ కమ్మని ప్రోత్సహించలేదు. తనను తనే ప్రేరేపించుకుంది. ఎలాగంటే తన గ్రామంలో నేలమీద నిలుచునే ఆకాశంలో ఎగిరే హెలికాప్టర్లను చూస్తూ ఉండేది. నేను ఎప్పటికైనా ఆకాశంలో ఎగరాలి అని కలలు కనేది' అంటున్నారు మావ్య మామ రాజ్ సుడాన్. హైదరాబాద్ దుండిగల్ వైమానిక దళం అకాడమీలో జూన్ 19న జరిగిన సంయుక్త గ్రాడ్యుయేషన్ పరేడ్‌లో ఆమెను ఫ్లయింగ్ ఆఫీసర్‌గా నియమించారు.
లాంబేరి గ్రామానికి చెందిన సుష్మా, వినోద్ సుడాన్ ముద్దులపట్టి మావ్య. 'చిన్ననాటి నుంచే మావ్య ఫైటర్ పైలట్ కావాలని ధృఢంగా నిశ్చయించుకుంది. దేశానికి తనవంతు సేవ చేయాలని ఆమె ఎప్పుడూ పరితపిస్తూ ఉండేది. ఆడపిల్ల వంటింటికే పరిమితం లాంటి మూస పద్ధతులకు తానెప్పుడూ వ్యతిరేకి. ఎంతో ధైర్యంగా, ధృఢ సంకల్పంతో ఉండేది. నన్ను కొత్త మార్గం వైపు నడక సాగించమని ఎప్పటికప్పుడూ ప్రోత్సహిస్తూనే ఉంటుంది' అని శ్రీ మాతా వైష్ణోదేవి పుణ్యక్షేత్రంలో జెఇగా ఉన్న మావ్య అక్క మన్యతా సుడాన్ చెబుతోంది.
ఆమె తల్లి సుష్మా సుడాన్ తన చిన్న కుమార్తె కష్టపడి తన లక్ష్యాన్ని సాధించినందుకు సంతోషంగా ఉందని, తండ్రి వినోద్ సుడాన్ 'మావ్య ఇప్పుడు నా కుమార్తె మాత్రమే కాదు, ఈ దేశానికి కుమార్తె. ప్రతి ఒక్కరి తల్లిదండ్రులు తమ కుమార్తెలను ప్రోత్సహిస్తే ఎందరో మావ్యలు పుట్టుకొస్తారు' అని చెబుతున్నారు. ప్రస్తుతం భారత వైమానికి దళం (ఐఎఎఫ్)లో 11 మంది మహిళా ఫైటర్ ఫైలట్లు సూపర్సోనిక్ జెట్లను నడపడంలో కఠినమైన శిక్షణ పొందారు. ప్రస్తుతం మావ్య సంవత్సరం పాటు కఠినమైన శిక్షణ తీసుకోవాల్సి ఉంది.
జమ్మూ కాశ్మీర్ గవర్నర్ మనోస్ సిన్హా 'భారత వైమానిక దళంలో ఫైటర్ ఫైలట్‌గా నియమితురాలైన మావ్య చరిత్ర సృష్టించారు. ఇది కేవలం తన ఒక్కదాని విజయం మాత్రమే కాదు. మిలియన్ల మంది అమ్మాయిల కలలకు ఆమె రెక్కలు ఇచ్చారు' అని ట్వీట్ చేశారు.
త్వరలోనే పూర్తి స్థాయిలో ఫ్లయింగ్ ఆఫీసర్‌గా నియమితురాలై, ఈ దేశం గర్వించేలా ఎదగాలని మనమూ మనస్ఫూర్తిగా కోరుకుందాం.