
యాత్రికులకు అన్ని సౌకర్యాల కల్పనకు కృషి
ఆలయ సహాయ కమిషనర్ ఇఒ యర్రంశెట్టి భద్రాజి
ప్రజాశక్తి - భీమవరం రూరల్
భీమవరం పట్టణం ఇలవేల్పుగా జిల్లాలోని పవిత్ర పుణ్యక్షేత్రంగా మావుళ్లమ్మ ఆలయం వెలుగొందుతుంది. మావుళ్లమ్మ దర్శనానికి పట్టణ యాత్రికులతో పాటు ఇతర రాష్ట్రాల, జిల్లాల నుంచి యాత్రికులు తరలివస్తారు. ముఖ్యంగా అమ్మవారి జాతర మహోత్సవాలు ప్రతి ఏటా సంక్రాంతి నెలలో ప్రారంభమవుతాయి. నెలరోజులకు పైగా ఘనంగా ఈ ఉత్సవాలు జరుగుతాయి. ఆలయాన్ని మరింత అభివృద్ధి పరిచేందుకు ప్రణాళిక సిద్ధం చేశామని, త్వరలోనే యాత్రికులకు కావాల్సిన మరిన్ని ఏర్పాట్లు చేయనున్నామని ఆలయ సహాయ కమిషనర్ ఇఒ యర్రంశెట్టి భద్రాజి తెలిపారు. ఈ మేరకు ఆయన ప్రజాశక్తితో మాట్లాడారు. మావుళ్లమ్మ దర్శనానికి విచ్చేసిన ప్రతి ఒక్క యాత్రికునికి అమ్మవారి ప్రసాదంగా భావించే ఉచిత అన్నదానాన్ని అందించాన్నదే తమ లక్ష్యమన్నారు. అమ్మవారి దర్శనానికి వచ్చిన యాత్రికులకు నిత్యాన్నదానం గతంలో వంద మందికి పెట్టేవారమని, ప్రస్తుతం 175 మంది నుంచి 250 మంది యాత్రికులకు అన్నదానం చేస్తున్నామని తెలిపారు. అన్నదానం ఏర్పాటు చేసేందుకు సరైన స్థలం లేక యాత్రికులు ఇబ్బందిగా ఉందన్నారు. తమ సిబ్బంది కూడా ఇరుకు గదిలో నిత్యం యాత్రికులకు భోజనాలు అందించడం ఇబ్బందిగానే ఉందని చెప్పారు. ఈ సమస్యను అధిగమించేందుకు అన్ని విధాలా ప్రయత్నిస్తామన్నారు. దీనిలో భాగంగా అన్నదానానికి అనుకూలంగా ఉండే భవనం కోస ఆలయ పాలకవర్గ సభ్యులు, తాము అన్వేషిస్తున్నామన్నారు. అమ్మవారికి స్వర్ణ కవచం చేసేందుకు బంగారం సేకరిస్తున్నామని తెలిపారు. ఇప్పటికే 51 కేజీలు ఉందన్నారు. దాతలు ఇచ్చిన బంగారంతో ఉందని, స్వర్ణకవచం చేయించేందుకు బంగారం సేకరిస్తున్నామని తెలిపారు. అమ్మవారికి స్వర్ణకవచం చేయించే విధంగా బంగారాన్ని తిరుపతి తరలించేందుకు చర్యలు చేపట్టనున్నట్లు చెప్పారు. ఇంకా 35 కేజీలు కావాల్సి ఉందని, యాత్రికులు ఎవరైనా విరాళంగా ఇవ్వాల్సినవారు ఆలయ అధికారులకు అందించాలని తెలిపారు. ఎంఎల్‌ఎ గ్రంధి శ్రీనివాస్ సూచన మేరకు పాలకవర్గం ఆధ్వర్యంలో ఆలయాన్ని మరింత అభివృద్ధి పరిచేందుకు ప్రణాళిక సిద్ధం చేశామని, త్వరలోనే యాత్రికులకు కావాల్సిన మరిన్ని ఏర్పాట్లు చేయనున్నట్లు తెలిపారు. ఆలయంలో దసరా వేడుకలు ఘనంగా నిర్వహించామని తెలిపారు. పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశామని, అఖండ అన్న సమారాధన నిర్వహించామని తెలిపారు.