ప్రజాశక్తి -సీలేరు
జీకే వీధి మండలం గాలికొండ పంచాయతీ మారుమూల మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో చింతపల్లి ఎఎస్‌పి కొమ్ము ప్రతాప్ శివ కిషోర్ బుధవారం పర్యటించారు. సువ్వపల్లి, చిన్న బసుకొండ, పెద బూసుకొండ, బత్తునూరు, లేత మర్రి, పాత్రుని గుంట, గాలికొండలలో గిరిజన గ్రామాలను సందర్శించారు. ఆయా గ్రామాల గిరిజనులతో సమావేశమై సమస్యలపై చర్చించారు. గ్రామాల్లో నెలకొన్న సమస్యలపై ఉన్నత అధికారులకు నివేదించి సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఎఎస్‌పి మాట్లాడుతూ ప్రభుత్వ పోలీస్ శాఖ నుంచి అందిస్తున్న సబ్సిడీలను ఉద్యోగ అవకాశాలను అందిపుచ్చుకోవాలని గిరిజనులకు సూచించారు. అనంతరం గిరిజన యువ క్రీడాకారులకు వాలీబాల్ కిట్లు పంపిణీ చేశారు. మందులు గిరిజనులకు అందజేశారు.
ఉపాధ్యాయ అవతారమిత్తి...
పాత్రుని గుంటలో ఎఎస్పీ పాఠశాలను సందర్శించారు. అక్కడ విద్యార్థులకు విద్యాభ్యాసాలు నేర్పుతూ ఉపాధ్యాయ అవతారం ఎత్తారు. పలక బలపం పట్టి అ, ఆ, ఇ, ఈ, ఉ, ఊలు ఎలా రాయాలో విద్యార్థులకు ఆయన చిరునవ్వుతో నేర్పించారు. పాఠశాలలో ఎటువంటి సమస్యలు ఉన్న తమ దృష్టికి తీసుకొస్తే పరిష్కరించేందుకు తమ వంతు కృషి చేస్తానని ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎస్సై రామకృష్ణ, పోలీసులు పాల్గొన్నారు.
ఉపాధ్యాయ అవతారమిత్తి...










