Oct 10,2022 23:45

గిరిజన యువకులతో మాట్లాడుతున్న ఎఎస్‌పి ప్రతాప్‌ శివ కిషోర్‌, సిఐ అశోక్‌కుమార్‌, ఎస్‌ఐ రామకృష్ణ

ప్రజాశక్తి- సీలేరు
మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ఎఎస్‌పి కొమ్ము ప్రతాప్‌ శివ కిషోర్‌ ఆది, సోమవారాల్లో విస్తృతంగా పర్యటించారు. సీలేరు పోలీస్‌ స్టేషన్‌లో రికార్డులు క్షుణ్ణంగా తనిఖీ చేశారు. సిఆర్పిఎఫ్‌ సెంట్రీ పోస్టులను పరిశీలించారు. జికె.వీధి సీఐ అశోక్‌ కుమార్‌, స్థానిక ఎస్సై రామకృష్ణ, సిఆర్పిఎఫ్‌ పోలీసులతో విడివిడిగా సమావేశమై శాంతి భద్రతలపై ఆరా తీశారు. పోలీస్‌ స్టేషన్లో సెంట్రీ పోస్టులో సిఆర్పిఎఫ్‌ పోలీసులు కట్టుదిట్టమైన భద్రత నడుమ విధులు నిర్వహించాలని ఆదేశించారు. ప్రతిరోజు సిఆర్పిఎఫ్‌ బలగాలతో తనిఖీలు చేయాలన్నారు. మావోయిస్టు కదిలికలపై నిఘా పెట్టాలని సూచించారు. అనంతరం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడుతూ గిరిజనులు మావోయిస్టులకు ఆకర్షతులు కాకుండా ఉండేందుకు ప్రభుత్వ పథకాలు గిరిజనులకు చేరువయ్యేలా చర్యలు చేపడుతున్నామని చెప్పారు. ప్రేరణ వంటి కార్యక్రమాల ద్వారా యువతీ యువకులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామన్నారు. గంజాయి యువత భవిష్యత్తును నాశనం చేస్తుందని, దీనినపి పూర్తిగా నిర్మూలన చేపట్టేందుకు ఇప్పటికే అనే కార్యక్రమాలు చేపట్టామని గుర్తు చేశారు. అల్లూరి జిల్లా ప్రముఖ పర్యాటక కేంద్రంగా దేశంలోనే ప్రసిద్ధిగాంచిందని, ఈ ప్రాంతంలో ఎన్నో ఫోటో స్టిల్స్‌ ప్రదేశాలు ఉన్నాయని, వాటిని ఫోటోలుగా చిత్రీకరించి, పర్యాటకులకు ఆకర్షణీయంగా గృహాలను నిర్మించి ఆదాయం పొందవచ్చని తెలిపారు. సీలేరు, దారకొండ వారపు సంతల్లో ఏఎస్పి పర్యటించి నకిలీ వస్తువులపై దృష్టి సారించారు. గిరిజనులకు నకిలీ వస్తువులు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. గిరిజనులు ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జికె.వీధి సీఐ అశోక్‌ కుమార్‌, స్థానిక ఎస్సై రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.